అరుదైన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులు

Delhi Hospitals See Kawasaki Symptoms in Covid19 Positive Kids - Sakshi

న్యూఢిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో సతమతమవుతోన్న దేశరాజధానిని తాజాగా ‘కవాసాకి’ కలవరపెడుతోంది. గత కొన్ని నెలలుగా ఢిల్లీలో కరోనాతో బాధపడుతున్న పిల్లల్లో ‘కవాసాకి’ అనే అరుదైన వ్యాధి లక్షణాలు బయటపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వ్యాధికి అధికంగా గురవుతారు. ఏ కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందో ఇంతవరకు తెలయలేదు. అయితే ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో జ్వరం, శరీరమంతా రక్తనాళాలు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం ఐదు రోజుల కన్నా  ఎక్కువ ఉండటమే కాక సాధారణ మందులకు తగ్గదని వైద్యులు తెలుపుతున్నారు. ఢిల్లీలోని కళావతి సరన్‌ అనే పిల్లల ఆస్పత్రిలో కవాసాకి లక్షణాలున్న కేసులు ఆరు ఉన్నాయి. అయితే వీరంతా కరోనాతో బాధపడుతున్నారు. ఈ పిల్లలందరు జ్వరం, జీర్ణకోశ, శ్వాసకోశ సమస్యలు, దద్దుర్లతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. (క‌రోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు)

ఈ క్రమంలో కళావతి సరన్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపించే అత్యంత సాధారణ లక్షణాలని తెలిపారు. ఇది కరోనాకు సంబంధించిన వ్యాధి కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్లే ఈ చిన్నారులంతా కవాసాకి బారిన పడ్డారని స్పష్టంగా చెప్పలేక పోతున్నామన్నారు. కానీ ఈ పిల్లలో కనిపించే లక్షణాలు మాత్రం కవాసాకి వ్యాధిలో కనిపించే లక్షణాలే అని కుమార్‌ తెలిపారు. పిల్లలంతా షాక్‌లో ఉన్నారని.. తమ అనారోగ్యం గురించి సరిగా చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాజిటివ్‌ కేసులన్నింటిని కోవిడ్‌ కేర్‌ ఏరియాలో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. వీరిలో ఇప్పటికే ఒకరు మరణించారని డాక్టర్‌ వెల్లడించారు.

గతంలో న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ మెడిసిన్‌ రెండు అధ్యయనాలు ప్రచురించింది. వీటిల్లో ఎమ్‌ఐఎస్‌-సీ అనే వ్యాధి గురించి చర్చించారు. మూడు వందల మంది అమెరికా టీనేజ్‌ పిల్లల్లో ప్రాణాంతకమైన ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరి సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్’‌(ఎమ్‌ఐఎస్‌-సీ) లక్షణాలు కనిపించాయని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ఎమ్‌ఐఎస్‌-సీ వ్యాధిలో కూడా జ్వరం, దద్దుర్లు, గ్రంథులు వాయడం.. కొన్ని సందర్భాల్లో గుండె మంటతో సహా కవాసాకిలో కనిపించే షాక్‌కు కూడా గురవుతారు. అయితే ఈ లక్షణాలను కనిపించిన వెంటనే చికిత్స అందించకపోతే.. పిల్లలు చనిపోయే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. (ఆ వ్యాక్సిన్‌పై సంతృప్తికర ఫలితాలు)

సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఆరు కేసులు వెలుగు చూశాయన్నారు వైద్యులు. వీరిలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా ఇద్దరిలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిరోధకాలను అభివృద్ధి కాలేదని తెలిపారు. మరోకేసులో కొద్ది రోజుల క్రితం అధిక జ్వరం, దద్దుర్లతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని బీఎల్‌కే ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడికి కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆ తర్వాత ఆ పిల్లాడు  పొత్తికడుపులో నొప్పి, వాంతులు, నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాక జ్వరం అధికమయ్యింది. చివరకు అతడి కాళ్లు, చేతులు చల్లగా, నీలం రంగులోకి మారిపోయాయి. ఈ వ్యాధి అతడి గుండె, మూత్రపిండాల మీద కూడా ప్రభావం చూపింది. ఫలితంగా ఆ పిల్లాడి కండీషన్‌ సీరియస్‌గా మారిందని వైద్యులు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top