1984 నాటి అల్లర్ల కేసులో కీలక తీర్పు | Sakshi
Sakshi News home page

1984 నాటి అల్లర్ల కేసులో కీలక తీర్పు

Published Tue, Nov 20 2018 4:51 PM

Delhi Court Verdict On Anti Sikh Riots Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్‌పాల్‌ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ తీర్పు వెలువడింది.

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు...
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్‌ సింగ్‌, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.

కాగా ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదనే కారణంతో 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేశారు. అయితే తమకు న్యాయం జరగాలంటూ సిక్కు నేతలు డిమాండ్‌ చేయడంతో ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)చే విచారణ జరిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత పాశవికంగా హత్య గావించబడ్డారని, ఇవి ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యలేనని సిట్‌ నివేదిక సమర్పించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన యశ్‌పాల్‌, నరేశ్‌లకు శిక్షలు ఖరారు చేస్తూ ఢిల్లీ పాటియాల కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement