రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తాం | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తాం

Published Sun, Apr 16 2017 3:36 AM

central minister responded on muslim reservations

- రిజర్వేషన్ల ప్రతిపాదనపై కేంద్ర సామాజిక న్యాయమంత్రి గెహ్లాట్‌
సాక్షి, న్యూఢిల్లీ:
రిజర్వేషన్ల వర్తింపు, పెంపునకు సంబంధించి రాజ్యాంగపరమైన ప్రక్రియకు లోబడి ముందుకెళ్తామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ చర్యలపై కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలేతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోందని, దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందని ప్రశ్నించగా.. ‘రిజర్వేషన్ల వర్తింపు, పెంపు ప్రక్రియ రాజ్యాంగ బద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదనలు పంపిన తర్వాత వాటిని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు పంపుతాం. వారి వద్ద ఉన్న కులాల గణాంకాల లెక్కల ఆధారంగా వారి అభిప్రాయాన్ని మాకు పంపుతారు. ఆ జాబితాను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పంపుతాం. వారు సమ్మతిస్తే బిల్లు రూపకల్పన చేస్తాం. రూపకల్పన చేసిన బిల్లు ముందుగా మంత్రి మండలి ఆమోదం పొందిన తర్వాత దానిపై పార్లమెంటు తుది నిర్ణయం తీసుకుంటుంది.’అని పేర్కొన్నారు.

ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు. రాందాస్‌ అథవాలే మాట్లాడుతూ మండల్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికలోనే సుమారు 80% ముస్లిం కులాలున్నాయని, ఆ కులాలు ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు పొందుతున్నాయని తెలిపారు.

Advertisement
Advertisement