‘చేసేదేంలేక కారు అక్కడే వదిలేసి..’ | CAA Protests Due To Traffic Jam Left My Car And Walked Back Home | Sakshi
Sakshi News home page

‘చేసేదేంలేక కారు అక్కడే వదిలేసి ఇంటికి చేరా’

Dec 19 2019 5:54 PM | Updated on Dec 19 2019 6:15 PM

CAA Protests Due To Traffic Jam Left My Car And Walked Back Home - Sakshi

ఈ కష్టాలు భరించలేక కొందరు తమ కార్లను రోడ్డుపైనే వదిలేసి కాలినడకన ఇళ్లకు చేరారు. నేను కూడా కారును అక్కడే వదిలేసి ..

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దేశ రాజధానికి వచ్చే వాహనాల్లో తనిఖీలు చేశారు. అయితే, గురుగ్రామ్‌ నుంచి వచ్చే వాహనాలను చెక్‌ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన ఈ తనిఖీలతో వాహనదారులతో పాటు పాదాచారులకు కూడా అసౌకర్యం కలిగింది. తనిఖీలపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఇంటి నుంచి బయల్దేరిన కొద్ది నిముషాలకే దాదాపు గంటపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. ఎన్‌హెచ్‌-8పై రెండు వైపులా ట్రాఫిక్‌ మయమే. వాహనాల మధ్య కనీసం మూరెడంతో ఖాళీ కూడా లేదు. పెద్దా చిన్నా అని తేడాలేకుండా అన్ని వాహనాలు అతుక్కుపోయినట్టుగా ఉన్నాయి.

ఈ కష్టాలు భరించలేక కొందరు తమ కార్లను రోడ్డుపైనే వదిలేసి కాలినడకన ఇళ్లకు చేరారు. నేను కూడా కారును అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాను. గురుగ్రామ్‌-ఢిల్లీ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ సాధారణమే. కానీ, ఇంత ట్రాఫిక్‌ను ఎప్పుడూ చూడలేదు’అని గురుగ్రామ్‌ వాసి ఒకరు వాపోయారు. ఉదయం పూట భారీ వాహనాలను గురుగ్రామ్‌-ఢిల్లీ హైవేపైకి అనుమతించడమే భారీ ట్రాఫిక్‌కి మరో కారణమని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతునిచ్చేందుకు మేవాత్‌ నుంచి కొంతమంది సమూహం వస్తున్నట్టు పక్కా సమాచారం ఉండటం.. శాంతి భద్రతల దృష్ట్యా వాహన తనిఖీలు చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ-గురుగ్రామ్‌ దారిని తాత్కాలికంగా మూసేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement