వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!

bjp u turn on assembly results in  maharashtra - Sakshi

తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్‌గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది.

శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో  పార్టీ ఎన్‌సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది.

ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్‌సీపీ– కాంగ్రెస్‌లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్‌సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్‌ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు.

అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్‌ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్‌ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. 

కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మండిపడుతున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top