బీజేపీకి పూర్వరూపమైన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీశాఖ నేతలు పలువురు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
న్యూఢిల్లీ: బీజేపీకి పూర్వరూపమైన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీశాఖ నేతలు పలువురు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన జీవితం, పార్టీకి అందించిన సేవల గురించి కార్యకర్తలకు వివరించడానికి పలు చోట్ల సదస్సులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, పార్టీ ఎంపీలు హాజరయ్యారు.
ఈసారి కేంద్రంలో బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు కాబట్టి ముఖర్జీ ఇప్పుడు తప్పకుండా సంతోషంగా ఉండి ఉంటారని హర్షవర్ధన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నేళ్లయినా జాతీయవాదులు, రాజకీయ కార్యకర్తలకు ముఖర్జీ ఆశయాలు ప్రేరణగా నిలుస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పార్టీ ఢిల్లీ విభాగ ఇన్‌చార్జ్ ప్రభాత్ ఝా అన్నారు. ఢిల్లీలోనిపార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా పలువురు సీనియర్లకు ముఖర్జీకి నివాళులు అర్పించారు.