వినూత్న ప్రయత్నం.. కేంద్ర మంత్రి ప్రశంసలు

Arunachal Pradesh Meat Vendor Replaces Plastic Bags With Leaves - Sakshi

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ మాంసం వ్యాపారి.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేశాడంటే.. ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని పూర్తిగా వదిలేయడమే కాక తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు మాంసాన్ని కవర్ల బదులు ఆకుల్లో ప్యాక్‌ చేసి ఇస్తూ.. సామాన్యులతో పాటు.. కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు దృష్టిని కూడా ఆకర్షించాడు. దాంతో అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు కిరెణ్‌ రిజిజు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ లేపా రాడా జిల్లాకు చెందిన స్థానిక మాంసం దుకాణదారుడు.. తన షాప్‌కు వచ్చి మాంసం తీసుకునే వారికి ప్లాస్టిక్‌ కవర్లకు బదులు ఆకుల్లో పెట్టి సరఫరా చేస్తున్నాడు.
 

ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్‌ రిజిజు తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మేం ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించడం లేదు. దాని బదులు స్థానికంగా లభించే ఆకులను ఉపయోగిస్తూ.. పర్యావరణహితంగా మెలుగుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు. మూడు రోజుల క్రితం షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికే 17వేలకు పైగా లైకులు సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మాంస దుకాణదారునిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ బాల్యంలో మాంసాన్ని ఇలానే ఆకుల్లో పెట్టి ఇచ్చే వారని గుర్తు చేసుకుంటున్నారు. 2022 నాటికి ఒకసారి మాత్రమే వినియోగించే వీలున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top