మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌

16 Naxals killed in police encounter in Maharashtra's Gadchiroli, search ops continue - Sakshi

గడ్చిరోలి జిల్లాలో 16 మంది మావోల మృతి

మృతుల్లో డివిజనల్‌ కమిటీ సభ్యులు సాయినాథ్, శ్రీకాంత్‌లు!

ముంబై/ కాళేశ్వరం /చింతలమానెపల్లి(సిర్పూర్‌)/పట్నా: మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో ఆదివారం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోలు మరణించారు. గడ్చిరోలి పోలీసులకు చెందిన సీ–60 కమాండోలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారని మహారాష్ట్ర ఐజీ శరద్‌ షెలార్‌ వెల్లడించారు. ‘భమ్రాగడ్‌లోని తాడ్‌గావ్‌ అడవుల్లో పెరిమిలి దళం కదలికలపై పక్కా సమాచారంతో గడ్చిరోలి ఎస్పీ అభినవ్‌ దేశ్‌ముఖ్‌ నేతృత్వంలో సి–60 కమాండోలు శనివారం కూంబింగ్‌ను ప్రారంభించారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వారికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు గంటలపాటు కొనసాగిన ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు.

ఈ  ఘటనలో తప్పించుకున్న వారికోసం గాలింపు చేపట్టాం. ఘటన స్థలంలో తుపాకులు, కిట్‌ బ్యాగులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నాం’ అని శరద్‌ తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో డివిజనల్‌ కమిటీ సభ్యులు సాయినాథ్, శీను అలియాస్‌ శ్రీకాంత్‌లు మరణించినట్లు భావిస్తున్నామని మహారాష్ట్ర డీజీపీ సతీష్‌ మాథుర్‌ తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదన్నారు. 2017లో గడ్చిరోలి జిల్లాలో 19 మంది సభ్యుల మరణం అనంతరం మావోయిస్టులకు తగిలిన గట్టి ఎదురుదెబ్బ ఇదే. మరోవైపు గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు కూడా కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.

కనుమరుగవుతున్న నక్సలిజం: రాజ్‌నాథ్‌  
దేశం నుంచి నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకు పోతోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పట్నాలో మాట్లాడుతూ.. పేదలు ఇంకా పేదరికంలోనే మగ్గాలని నక్సల్స్‌ కోరుకుంటున్నారని, వారి పిల్లలు మాత్రం ప్రముఖ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారని, కొందరు విదేశాల్లో ఉన్నారని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

మృతుల్లో తెలుగు వ్యక్తి!
చిట్యాల(భూపాలపల్లి): గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో పెరిమిలి దళ కమాండర్‌ సాయినాథ్‌ అలియాస్‌ దోమేశ్‌ ఆత్రం(34), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన రౌతు విజేందర్‌ అలియాస్‌ శ్రీను అలియాస్‌ శ్రీకాంత్‌(41) ఉన్నట్లు తెలుస్తోంది.  రౌతు అహల్య, నర్సింహారాములు దంపతుల ముగ్గురు కుమారుల్లో శ్రీకాంత్‌ రెండోవాడు. స్థానిక పాఠశాలలో 10వ తరగతి వరకూ చదువుకున్న శ్రీకాంత్‌ 1990లో గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్, శెట్టి రాజపాపయ్య నేతృత్వంలోని పీపుల్స్‌వార్‌ అనుబంధ బాలల సంఘంలో చేరాడు. 1996లో రాడికల్‌ యువజన సంఘం ఏరియా కమిటీలో పనిచేశాడు.  జైల్లో పరిచయమైన మావో అగ్రనేత శాఖమూరి అప్పారావు సహచర్యంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2000లో పీపుల్స్‌వార్‌లో చేరిన శ్రీకాంత్‌ ప్రస్తుతం గడ్చిరోలి జిల్లా డివిజినల్‌ కమిటీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. సాయినాథ్‌పై 72 , శ్రీకాంత్‌పై 82 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top