షూటింగ్స్‌ గురించి జూన్‌లో మాట్లాడతాం

We will talk about the shootings in June says Talasani Srinivas Yadav - Sakshi

తలసాని శ్రీనివాస యాదవ్‌

‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆదేశాల మేరకు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక కోసం చిరంజీవి, నాగార్జునలతో ఇప్పటికే చర్చించాం. ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించనున్న సమయంలో కరోనా వైరస్‌ ప్రభావం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఉత్తమమైన విధానం తీసుకొస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం తలసాని విలేకరులతో మాట్లాడుతూృ ‘‘కరోనా వైరస్‌ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌కు ఆయువుపట్టుగా ఉన్న చలనచిత్ర పరిశ్రమ, థియేటర్లు మూతబడ్డాయి. ఈ కారణంగా వాటిపై ఆధారపడ్డ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రేషన్‌ కార్డు ఉన్న కార్మికులకు ప్రభుత్వం రూ.1500లతో పాటు 12 కేజీల బియ్యం అందిస్తోంది. ఇండస్ట్రీ వారు ‘కరోనా క్రై సిస్‌ చారిటీ మనకోసం’ ద్వారా 14వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సినీ పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. థియేటర్లలో భౌతిక దూరం, ఇండస్ట్రీకి పవర్‌ టారిఫ్‌లపై, మారిటోరియం విషయంపైనా చర్చించనున్నాం.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్, తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌.. ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే చర్చించాం. జూన్‌లో సినిమా షూటింగ్స్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలపై మాట్లాడతాం. టీవీ షూటింగ్‌లకు కూడా ప్రస్తుతానికి అనుమతులు ఇవ్వలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందున సినిమాలకు సంబంధించిన నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top