అన్ని అడ్డంకులను దాటిన రచయిత

Vidya Sagar Raju, Sanchita Padukone @ Rachayitha Movie Press meet - Sakshi

‘‘చిన్న సినిమాల విడుదలలో చాలా ఇబ్బందులున్నాయంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. ‘రచయిత’ సినిమా విడుదలకు నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సినిమాని రంజిత్‌ మూవీస్‌ డిస్ట్రిబ్యూషన్లో నైజాంలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇదొక పక్కా తెలుగు సినిమా’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్‌. విద్యాసాగర్‌ రాజు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రచయిత’. సంచిత పదుకొనే కథానాయిక. కల్యాణ్‌ ధూళిపాళ్ల నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత ధూళిపాళ్ల మాట్లాడుతూ– ‘‘సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే.. రిలీజ్‌ చేయడం మరో ఎత్తని ‘రచయిత’ రిలీజ్‌ విషయంలో నాకు తెలిసింది. మా సినిమా అడ్డంకులను అధిగమించడానికి కృషి చేసిన దామోదరప్రసాద్, రామదాసు, హీరో జగపతిబాబులకు ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎమోషన్‌ థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఒక అమ్మాయి మనసు లోతు ఎంత ఉంటుందో చూపించాం. చంద్రబోస్‌ మూడు పాటలకు అద్భుతమైన లిరిక్స్‌ అందించారు’’ అన్నారు విద్యాసాగర్‌ రాజు. నిర్మాత ముత్యాల రామదాస్, పాటల రచయిత చంద్రబోస్, సంచిత పదుకొనే తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top