దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు

Talasani Srinivas Yadav Speech @ Dasari Narayana Rao’s statue to be unveiled - Sakshi

తలసాని శ్రీనివాస యాదవ్‌

‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్‌ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్‌ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్‌లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్‌ నటుడు కృష్ణ అన్నారు.

శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు  లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీశారు.

ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్‌లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్‌ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
 

మే 4.. డైరెక్టర్స్‌ డే
 దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్‌ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్‌ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్‌ డే’ అని అనౌన్స్‌ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్‌ డేగా అనౌన్స్‌ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్‌. నారాయణమూర్తి.

తనికెళ్ల భరణి ‘సినిమా’  మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్‌పై చంద్రబోస్‌ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి    సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌.

అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ?
– దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్‌ ఇన్ఫో గ్లోబల్‌ లిమిటెడ్‌’ ఛైర్మన్‌ బీయస్‌యన్‌ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్‌ అకాడమీ వెబ్‌సైట్‌’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు.

కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్‌ ఇయర్‌లో చూశాం’’ అన్నారు.

దాసరిగారు నిజంగా ఓ శిఖరం
– ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె. రామచంద్రమూర్తి
‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు.

ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్‌లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

                                              దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు


                                          ‘డైరెక్టర్స్‌ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top