
కథ చెప్పండి
ముందు కథ చెప్పండి.
ముందు కథ చెప్పండి. అనుమతివ్వాలా ? లేదా? అన్నది ఆ తరువాత ఆలోచిస్తాను అని అన్నారట నటి నయనతార. కథ చెప్పమనడం ఏమిటి? ఆమె అనుమతివ్వడం ఏమిటి? అని అనుకుంటున్నారా? అయితే చదవండి. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న జి.వి ప్రకాష్ కుమార్ తాజాగా హీరోగా అవతారం ఎత్తారు. ఈయన నటిస్తున్న పెన్సిల్ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. తాజాగా మరో చిత్రం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ చిత్రానికి త్రిష ఇల్లన్నా నయనతార అనే టైటిల్ నిర్ణయించారు. అయితే టైటిల్‌ను నిర్మాతల సంఘంలో రిజిస్టర్ చెయ్యబోగా అక్కడి నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. ప్రముఖ తారల పేరుతో టైటిల్ పెట్టినప్పుడు వారి అనుమతి తీసుకోవాలని తెలిపారు. దీంతో చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్, జి.వి.ప్రకాష్ కుమార్ నయనతారను కలిసి టైటిల్‌కు అనుమతి కోరారు.
దీంతో ఆమె ముందు కథ చెప్పండి అది విన్న తరువాత అనుమతివ్వాలా లేదా అన్న విషయం గురించి ఆలోచిస్తానన్నారట. దీంతో దర్శకుడు త్రిష ఇల్లనా నయనతార చిత్ర కథ పూర్తిగా వినిపించక తప్పలేదు. కథ విన్న నయనతార తన పేరును టైటిల్‌లో చేర్చడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ పత్రంలో సంతకం చేశారట. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న ఈ దర్శక, హీరోలు తదుపరి త్రిష అనుమతి పొందడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.