మజిలీ సక్సెస్‌ నాకెప్పుడూ ప్రత్యేకమే: నాగచైతన్య

Majili movie success meet - Sakshi

‘‘నా లైఫ్‌లో, నా కెరీర్‌లో నిజంగా ఒక క్రూషియల్‌ పాయింటాఫ్‌ టైమ్‌లో అందమైన పాత్రను, ఎప్పటికీ మరచిపోలేని సక్సెస్‌ను ఇచ్చాడు శివ నిర్వాణ. ఫ్యూచర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌ వస్తుంటాయి. కానీ, ఈ సక్సెస్‌ అన్నది నాకెప్పుడూ ప్రత్యేకమే. థ్యాంక్యూ సో మచ్‌ బ్రో’’ అని నాగచైతన్య అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశ కౌశిక్‌  హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్రాండ్‌ థ్యాంక్స్‌ మీట్‌’లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా సక్సెస్‌ అన్నది ఎవరో ఒకరి వల్ల అవదు. ఒక డైరెక్టర్‌ విజన్‌తో స్టార్ట్‌ అయి, ఆ విజన్‌ని నిర్మాతలు సపోర్ట్‌ చేసి, ఎంతోమంది నటీనటులు ఆ కథ విని ఓకే చేసి, ఆ తర్వాత సాంకేతిక నిపుణులు జాయిన్‌ అయ్యి, లాస్ట్‌కి డిస్ట్రిబ్యూటర్స్‌ సినిమా చూడకుండా జస్ట్‌ ట్రైలర్స్, టీజర్స్‌ చూసి, సినిమా కొని, ప్రేక్షకులకు అందించి.. ఫైనల్లీ ఒక మంచి హిట్‌ని అందుకుంటాం. ఈ ప్రాసెస్‌లో ఉన్న అందరూ ఈ రోజు సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నా చివరి చిత్రాలు పెద్ద ఎంకరేజింగ్‌గా లేకపోయినా సాహు, హరీష్‌గారు నన్ను ప్రోత్సహించి, పెద్ద సక్సెస్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌. చివరి నిమిషంలో తమన్‌ ఈ సినిమాని ఒప్పుకుని జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.  

డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ...


‘‘శివ నిర్వాణ ‘మజిలీ’ ఐడియా చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అని దానయ్యగారితో అన్నాను. మంచి రైటింగ్, సీన్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి, సినిమా కూడా ఇలాగే నేలమీదుండాలి.. అలాంటి కథలు తక్కువ అని శివకి చెప్పాను. వైజాగ్‌ నేపథ్యం, నటీనటులను ఎంచుకున్న విధానం బాగా నచ్చింది. ఒక్క సీన్‌లో నటించినవారు కూడా బాగా గుర్తుండిపోయారు. శివది ఎక్స్‌ట్రార్డినరీ వర్క్‌. నీలో ఓ చిన్న నొప్పి ఉంది. లైఫ్‌లో ఎవరైనా అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందేమో (నవ్వుతూ).. రావు రమేశ్, పోసానిగారులాంటి నటులు ఉండటం మా ఇండస్ట్రీ అదృష్టం. చైతన్యగారిని స్క్రీన్‌పై చూసినప్పుడు చాలా నిజాయతీగా కనిపిస్తారు. తన బలం, బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. నిజాయతీగా ఉండటం వల్ల ప్రతి పాత్ర ఆయన చేస్తుంటే గుర్తుండిపోతోంది. ‘మజిలీ’ సినిమా చూసినప్పుడు మీ నటనని నమ్మలేకపోతున్నాను. పూర్ణ  (చైతన్య పాత్ర)ని చూస్తుంటే వైజాగ్‌లోని రైల్వే కాలనీలో నిజంగానే అలాంటి పాత్ర ఉందేమో అనిపించింది. సమంతగారు గ్రేట్‌ ఆర్టిస్ట్‌. ‘జనతా గ్యారేజ్‌’కి పనిచేశా. సాహు, హరీష్‌ మరెన్నో హిట్‌ సినిమాలు తీయాలి’’ అన్నారు.

నటుడు రావు రమేశ్‌ మాట్లాడుతూ...

 ‘‘హిట్‌ అవుతుంది అనుకున్న సినిమా హిట్‌ అయితే ఆ కిక్కే వేరు. ఈ చిత్రంలో అన్ని పాత్రలను శివ నిర్వాణ ఎంతో ధైర్యంగా డిజైన్‌ చేసిన విధానం నాకు నచ్చింది. ఫస్టాఫ్‌లో చైతన్య, దివ్యాంశ లవ్‌ట్రాక్‌ చూస్తే ‘టైటానిక్‌’ సినిమా చూసినట్టుంది. సెకండాఫ్‌లో చైతు, సమంత ట్రాక్‌ కూడా చాలా బాగా కుదిరింది’’ అన్నారు. 

నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ...

‘‘పరుచూరి బ్రదర్స్‌ వద్ద నేను చెన్నైలో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్లేవాణ్ణి. సినిమా హిట్టయ్యాక నటీనటులు, సాంకేతిక నిపుణులకు షీల్డ్‌లు ఇచ్చేవారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ‘మజిలీ’ సినిమా హిట్‌ షీల్డ్‌ అందుకుంటుండటం హ్యాపీ. నాగచైతన్య.. నీ తొలి సినిమా ‘జోష్‌’లో నువ్వు బొమ్మలా ఉన్నావ్‌.. ఈ సినిమాలో అంతకు మించి ఉన్నావ్‌. కామెడీ, సెంటిమెంట్‌ పాత్రలు చేయాలని నాకు బాగా కోరిక. నాకు స్కూల్‌డేస్‌లో, యూనివర్శిటీలో బెస్ట్‌ కమెడియన్‌ అవార్డు వచ్చింది. నాకు పోలీస్, తండ్రి పాత్రలు నచ్చవు. కానీ, ఆ తండ్రి పాత్రలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ‘టెంపర్‌’లో పోలీసు పాత్రతో ఎంత పేరొచ్చిందే, నా జీవితాన్ని ఎంత మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. ‘టెంపర్‌’ కి ఎంత పేరొచ్చిందో ‘మజిలీ, చిత్రలహరి’ సినిమాల్లో తండ్రి పాత్రలకు అంత పేరొచ్చింది’’ అన్నారు.  ‘‘8రోజుల్లో ‘మజిలీ’ సినిమాకి నేపథ్య సంగీతం అందించాను.  ఎంతో ప్రేమించి పనిచేశా’’ అన్నారు తమన్‌. 

శివ నిర్వాణ మాట్లాడుతూ...

‘‘ఇటీవల కొన్ని రోజుల వరకూ నాకు గ్రాస్‌కి, షేర్‌కి తేడా తెలియదు. కానీ 15రోజుల నుంచి కొత్త కొత్త విషయాలు చూస్తున్నా. ఇన్ని కోట్లు వసూలు చేసింది సినిమా అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు వస్తుండటం, వసూళ్ల నంబర్స్‌ చూస్తున్నప్పుడు ముఖ్యంగా చైతన్యగారికోసం చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆయనకి ఈ రేంజ్‌లో సక్సెస్‌ రావడం చాలా హ్యాపీ. చైతన్యగారిలో ఇంత మంచి నటుడు ఉన్నాడని అనుకోలేదు, చాలా బాగా చూపించారని చాలా మంది అన్నారు. ‘ఏమాయ చేసావే’ నుంచి తన నటనని నేను నమ్మాను. తనకు కరెక్ట్‌ పాత్ర పడితే తనకంటే న్యాయం చేసేవారెవరూ ఉండరని అనుకున్నా. ‘మజిలీ’ లో చైతన్య కాకుండా వేరే ఎవరైనా అయితే బాగుండని ఒక్కరూ అనలేదు. సినిమా చూస్తున్నప్పుడు సమంతగారికి నేను ఫ్యాన్‌గా మారిపోతున్నానేమో అనుకున్నా. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో ఆమె చాలా బాగా చేశారు. రేపంటూ ఒక కథ రాస్తే సమంతగారి లాంటి నటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్‌ రాస్తా. ఈ సినిమాకి చైతన్య, సమంతగారు లైఫ్‌ ఇచ్చారు’’ అన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి చిత్రబృందాన్ని అభినందించారు.ట 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top