‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్‌పై..

MAA Executive Member Fires On President Naresh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ అభివృద్ధికి న‌రేశ్ అడ్డంకి మారార‌ని, నిధులు దుర్వినియోగం చేయ‌డంతో పాటు ఈసీ స‌భ్యుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని లేఖలో పేర్కొన్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన న‌రేశ్‌పై  చర్యలు తీసుకోవాలని 9 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి పంపారు. ఈ లేఖలో జీవిత రాజశేఖర్‌, జయలక్ష్మి, మహ్మద్‌ అలీ, ఎంవీ బెనర్జీ,  రాజారవీంద్ర, ఉత్తేజ్‌లతో పాటు మరో పదిమంది సభ్యులు సంతకాలు చేశారు. 

కాగా, ఇటీవల జరిగిన  ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్... తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top