‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ మూవీ రివ్యూ

Inthalo Ennenni Vinthalo Movie Review - Sakshi

టైటిల్ : ఇంతలో ఎన్నెన్ని వింతలో
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నందు, పూజ రామచంద్రన్‌, సౌమ్య వేణుగోపాల్‌
సంగీతం : యాజమాన్య
దర్శకత్వం : వరప్రసాద్‌ వరికోటి
నిర్మాత : ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, ఇప్పిలి రామ్మోహన్‌ రావు

యువ నటుడు నందు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కాలంగా కష్టపడుతున్న నందు ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్‌ సాధించాలని భావిస్తున్నాడు. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నందుకు ఆశించిన విజయాన్ని అందించిందా..? ఘన విజయాలుసాధిస్తున్న చిన్న సినిమాల సరసన ఇంతలో ఎన్నెన్ని వింతలు చేరిందా..?

కథ :
విష్ణు (నందు).. మోడ్రన్‌ శ్రీరామ చంద్రుడు లాంటి కుర్రాడు. వ్యవహారశైలిలో గాని వ్యక్తిత్వంలో గాని ఎలాంటి మచ్చలేని మంచి కుర్రాడు. విష్ణులోని ఆ మంచితనం చూసే వందన (సౌమ్య వేణుగోపాల్) ప్రేమలో పడుతుంది. ఓలెక్స్ ద్వారా పరిచయం అయిన విష్ణు, వందనలు ఒకరికొకరు నచ్చటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలు కూడా అంగీకరించటంతో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ చేస్తారు. పెళ్లిపనులన్ని పూర్తి చేసిన విష్ణు తెల్లవారితే పెళ్లి అనగా ఫ్రెండ్స్‌ కలిసి బ్యాచిలర్స్‌ పార్టీ చేసుకోవడానికి ఓ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తార (పూజ రామచంద్రన్‌) విష్ణు గ్యాంగ్‌కు కలుస్తుంది. తార పరిచయం కారణంగా విష్ణు అతని స్నేహితులు ఇబ్బందుల్లో పడతారు. ఈ ఇబ్బందులను దాటుకొని విష్ణు ముహూర్తం సమయానికి పెళ్లి మండపానికి చేరుకున్నాడా..? అసలు తార వల్ల ఎదురైన ఇబ్బందులు ఏంటి..? వాటిని విష్ణు ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న నందు అన్నీ మంచి లక్షణాలే ఉన్న అబ్బాయి పాత్రలో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్‌తోనూ మెప్పించాడు. హీరోయిన్‌ సౌమ్య వేణుగోపాల్ కు పెద్దగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కక పోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. తారా పాత్రలో పూజా రామచంద్రన్‌ మెప్పించింది. ఫస్ట్‌ హాఫ్‌లో హాట్‌ లుక్స్‌ ఆకట్టుకున్న  పూజా క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్‌ డైలాగ్స్ లో పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో పెద్దగా గుర్తింపు ఉన్న నటులు కనిపించలేదు. కాస్టింగ్‌ ఇంకాస్త బాగుండి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. తనకున్న బడ్జెట్‌ పరిదిలో ఓ మంచి ఎంటర్‌టైనర్‌ తీయాలనుకున్న దర్శకుడు వర ప్రసాద్‌ విజయం సాధించాడనే చెప్పాలి. అనుకున్న కథను ఎక్కడా గాడి తప్పకుండా ఆడియన్స్‌ ను కదలకుండా కూర్చో బెట్టేలా కథా కథనాలను నడిపించాడు. టైటిల్‌కు తగ్గట్టుగా సినిమాలో ఎన్నో ట్విస్ట్‌ లు చూపించి మెప్పించాడు. కథా కథనాలకు అవసరం లేకపోయినా పాటలను ఇరికించకుండా కథలో భాగంగా వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ సాంగ్స్‌ తో సినిమా వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. యాజమాన్య అందించిన బ్యాక్‌ గ్రౌండ్ సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. అక్కడక్కడా తడబడినా ఓవరాల్‌గా సినిమాను ఎంటర్‌టైనింగ్‌ తెరకెక్కించటంలో చిత్రయూనిట్‌ విజయం సాధించిందనే చెప్పాలి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
నందు నటన

మైనస్‌ పాయింట్స్‌ :
సహాయ పాత్రల్లోని నటులు
అక్కడక్కడా నెమ్మదించిన కథనం

- సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top