నేను పెద్ద హీరోని అనుకోను

F2 Movie Pre Release Function - Sakshi

వెంకటేశ్‌

‘‘సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను, వరుణ్‌ సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అని వెంకటేశ్‌ అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా ‘దిల్‌’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘నేను పెద్ద హీరోని అని ఎప్పుడూ అనుకోను.

కథ, దర్శకుడు అనిల్‌ని నమ్మి ఈ సినిమా చేశా. ‘దిల్‌’ రాజుగారితో మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెంకటేశ్‌గారి అభిమానిని అయ్యా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అనిల్‌’’ అన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ టైమ్‌ ఓ మాస్‌ క్యారెక్టర్‌ చేశాను.

అది కూడా కామెడీ క్యారెక్టర్‌. ‘ఎఫ్‌ 2’తో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్‌ దొరికినందుకు ఆనందంగా ఉంది. ‘దిల్‌’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ‘ఫిదా’ తర్వాత మరోసారి పనిచేయడం హ్యాపీ. మా పెదనాన్నగారి (చిరంజీవి) కాన్‌టెంపరరీ హీరో వెంకటేశ్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో ఫ్రెండ్‌లా, మెంటర్‌లా ఉన్నారు. నెక్ట్స్‌ టైమ్‌ ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి రెడీ’’ అన్నారు. ‘‘ఎఫ్‌ 2’ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. టైమింగ్‌ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు’’ అన్నారు అనిల్‌ రావిపూడి. నటులు రాజేంద్రప్రసాద్, కథానాయికలు తమన్నా, మెహరీన్, నిర్మాత శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top