మెంటలెక్కిస్తున్నారు

Different Storys in tollywood industry - Sakshi

పిచ్చెక్కిస్తున్నారు.  హిట్‌ల మీద హిట్‌లు కొట్టి పిచ్చిపిచ్చిగా ఆడిస్తున్నారు. మైండ్‌ తన్నితే చాలు.. డబ్బులే డబ్బులు! చిన్న సైకో ప్రాబ్లమ్‌ చాలు.. పిక్చర్‌ పెద్ద హిట్‌ కొట్టడానికి! కనకవర్షానికి ఇప్పుడు... కొత్త ధ్వని.. లక లక లక!

తిన్నగా ఉంటే ఎవరూ తల తిప్పి చూడరు. తేడాగా ఉండాలి. మనిషైనా, మూవీ అయినా. మనిషి తేడాగా ఉంటే ‘వీడెవడ్రా తేడా గాడు’ అని దూరంగా వెళ్లిపోతాం. సినిమా తేడాగా ఉంటే ‘డిఫరెంట్‌గా ఉందట గురూ’ అనుకుంటూ థియేటర్‌కి వెళ్లిపోతాం. మూవీ ఆడిందంటే తేడాగా ఉందనే. అలాగని, తేడా ఉన్న ప్రతిదీ ఆడేస్తుందని కాదు. కొన్ని ఆడేసుకునేవీ ఉంటాయ్‌. ఆటాడుకున్నవీ ఉంటాయి. ఆడేసుకోవడం చూసినవాళ్లనీ, ఆటాడేసుకోవడం తీసినవాళ్లనీ!

‘వీడు తేడా’ అని ఆరేళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. టైటిల్‌ వరకే అది తేడా. స్టోరీలో తేడా లేదు. రెగ్యులర్‌ లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. తింగరి టైటిల్‌ చూసి, టైటిల్‌ రైటింగ్‌లోని వంకర టింకర్లను చూసి రవితేజ మూవీ ఏమో అనుకుంటాం. కాదు. నిఖిల్‌ హీరో. జనరల్‌గా మన హీరో క్యారెక్టర్‌లలో రవితేజ బాగా తేడా.  ఆ తేడా కొంచెం నిఖిల్‌లో కూడా ఉంది. అందుకే..  డైరెక్టర్‌ చిన్నికృష్ణ .. అఖిల్‌తో ‘వీడు తేడా’ అని తీశాడు.

అఖిల్‌ నిజంగా తేడాగా కనిపించే మూవీ మాత్రం ‘సూర్య వర్సస్‌ సూర్య’. 2015లో వచ్చింది. డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని. అందులో నిఖిల్‌కి ‘పోర్‌ఫీరియా’. కోటి మందిలో ఒకరికి వచ్చే జెనిటిక్‌ డిజార్డర్‌! అతడి బాడీ హిమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చెయ్యదు. ఎండ తగిలితే పదిహేను నిమిషాల్లో చచ్చిపోతాడు! వేరే మార్గం లేక నైట్‌ కాలేజ్‌కి వెళ్తాడు. ఇంట్లో లేట్‌ నైట్‌ షోలు చూస్తూ టీవీ యాంకర్‌ త్రిదా చౌదరి ప్రేమలో పడతాడు. ప్రేమతో పోలిస్తే పోర్‌ఫీరియా ఏమంత పెద్ద డిజార్డర్‌?! నిఖిల్‌ ఎలా త్రిదా ప్రేమను గెలిచాడన్నది స్టోరీ.

ఈమధ్య జనం చూసిన తేడా సినిమా ‘అర్జున్‌రెడ్డి’. అందులో విజయ్‌ దేవరకొండకు పనిగట్టుకుని డిజార్డర్‌ ఏమీ ఉండదు. లవ్‌లో పడి ఒక ఆర్డర్‌ లేకుండా పోతాడు. లవ్‌లో పడినవాళ్లంతా ఆర్డర్‌ లేకుండా పోతారా? పోరు. ఇందులో ఎమోషనల్లీ వాడు తేడా. యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ చేతకాదు. ‘ఎవడ్రా వాడు.. ఓయ్‌’ అని పెద్దగా లేస్తాడు.. వాడి పిల్లను ఎవరైనా, ఏమైనా అంటే. ఆడింది.

రైట్‌ నౌ.. జనం చూస్తున్న తేడా మూవీ ‘మెంటల్‌ మదిలో..’ వివేక్‌ ఆత్రేయ డైరెక్టర్‌. శ్రీవిష్ణు హీరో. ‘మనవి ఆలకించరాదటే’ అన్నది టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌. పిల్లాడు శుభ్రంగా ఉంటాడు. కానీ గందరగోళం. రెండుంటే ఒకటి సెలక్ట్‌ చేసుకోలేడు. కళ్లముందు ఒకటే ఉండాలి. తల్లొచ్చి హెల్ప్‌ చేస్తుంది. మల్టిపుల్‌ ఛాయిసెస్‌ డిజార్డర్‌. బీరువా తెరుస్తాడు. ఆ రోజు ఏ షర్ట్‌ వేసుకోవాలో తేల్చుకోలేడు. ఇదా, అదా.. ఇది కాకపోతే అదా, అది కాకపోతే ఇదా.. కన్‌ఫ్యూజన్‌. అన్నీ ఇంతే. చాయిస్‌ అంటే వాయిస్‌ డౌన్‌ అయిపోతుంది. కాళ్లూ చేతులు ఆడవు. దేవుడు అన్నిచోట్లా ఉండలేక తల్లి లాంటి స్త్రీని సృష్టించాడని అంటారు. ఎంత తల్లయినా ఇలాంటి కన్‌ఫ్యూజన్‌ కొడుకు వెళ్లిన చోటుకల్లా వెళ్లి, సెలక్ట్‌ చేసి పెట్టగలదా?! చివరి వాడి దరిద్రం. లైఫ్‌లోకి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తారు. వాళ్లలో ఎవర్ని సెలక్ట్‌ చేసుకోవాలన్నది ప్రాబ్లమ్‌.

దీనికి ముందొచ్చిన తేడా మూవీ ‘మహానుభావుడు’. హీరో శర్వానంద్‌. డైరెక్టర్‌ మారుతి. క్లీన్‌ అండ్‌ టైడీ అని మూవీకి రివ్యూలు వచ్చాయి. ఇందులో హీరోకి అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌. బ్రీఫ్‌గా ఓసీడీ. శుభ్రత అతడి వీక్‌నెస్‌. చేతుల శుభ్రం, కాళ్ల శుభ్రం, నోటి శుభ్రం, ఒంటి శుభ్రం. టోటల్‌గా మనిషి అతి శుభ్రం. కుర్రాడు అందంగా ఉంటాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌. అయితే అపరిచితుడిలా అతడిలోని ‘అతిశుభ్రుడు’ సమయం, సందర్భం లేకుండా పైకి వచ్చేస్తుంటాడు. అంత శుభ్రతలో కూడా.. తన టీమ్‌లోకి కొత్తగా వచ్చి చేరిన మెహ్రీన్‌ని లవ్‌ చేసేస్తాడు! ఆ అమ్మాయి కూడా ఈ స్వచ్ఛ భారతీయుడిని లవ్‌ చేస్తుంది. కానీ అతడిది ‘మనసు లేని శుభ్రత’ అని బయటపడిన రోజు మెహ్రీన్‌ మనసు విరిగిపోతుంది. ఆమె తండ్రికి హార్ట్‌ ఎటాక్‌ వస్తే తన ఓసీడీ కారణంగా ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లలేకపోతాడు శర్వానంద్‌! అది ఆమెను హర్ట్‌ చేస్తుంది. మళ్లీ ఎలా కలుసుకున్నారన్నది మిగతా స్టోరీ.

ఈ సినిమా వచ్చినప్పుడు ‘మారుతి మరో జబ్బు సినిమా’ అని కూడా రివ్యూలు వచ్చాయి. మారుతి మళ్లీ ఇలాంటి సినిమానే ఇంకోటి తీస్తే.. నో డవుట్‌.. డిజార్డర్‌ల డైరెక్టర్‌ అయిపోతాడు ఆయన.
మహానుభావుడికి ముందు మారుతి ‘భలే భలే మగాడివోయ్‌’ తీశాడు. అందులో హీరో నానీ. మతిమరుపు అతడి డిజార్డర్‌. అది అతడిని కష్టాల్లో పడేస్తుంటుంది. ఆ కష్టాల్లోంచి కామెడీని లాక్కున్నాడు మారుతి.

‘గజనీ’ మూవీలో హీరో సూర్యకి ‘యాంటెరోగ్రేడ్‌ ఆమ్నీసియా’. అతడి మెమరీ పావుగంట మాత్రమే ఉంటుంది! లవ్‌ని మిక్స్‌ చేసి రెండున్నర గంటల సేపు లాగాడు మురుగదాస్‌. హిట్టయింది. సూర్యతో అతడు తీసిందే ‘సెవన్త్‌ సెన్స్‌’. అందులో సూర్యకు డిజార్డర్‌ ఏమీ లేదు. ‘బియాండ్‌ ఆర్డర్‌’ పనిచేస్తుంటుంది అతడి మైండ్‌. అదీ హిట్‌.

సుకుమార్‌ ‘1 నేనొక్కడినే’లో మహేశ్‌బాబుది ‘ఇంటెగ్రేషన్‌ డిజార్డర్‌’. అతడి బ్రెయిన్‌లోని ‘గ్రే ఏరియాలో’ 25 పర్సెంట్‌ మిస్‌ అవుతుంది. దాంతో ఏవో కలలు అతడిని వెంటాడుతుంటాయి. వాటిని నిజం అనుకుని, ఆ కలల్లో వ్యక్తుల్ని పోల్చుకుని ఒక్కొక్కర్నీ చంపేస్తుంటాడు. జనానికి పిచ్చెత్తిపోయింది. పిచ్చిని పిచ్చిగా చూపిస్తే ఇంతే. ఇంకేదైనా మిక్స్‌ చెయ్యాలి. ఆ మిక్సింగ్‌ మిస్సయింది ‘1 నేనొక్కడినే’లో.
‘అపరిచితుడు’లో విక్రమ్‌ది ‘మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’. మనిషి ఒక్కడే. లోపల ముగ్గురు ఉంటారు. అవసరాన్ని బట్టి ఒకడు బయటికి వస్తుంటాడు. ‘చంద్రముఖి’లో జ్యోతిక ‘స్పి›్లట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ ఇంచుమించు ఇలాంటిదే. ఆమె దెబ్బకు ఇంట్లో ఒక్కొక్కరూ ఒణికి చస్తుంటారు.

ఇవి కాకుండా ‘బై పోలార్‌ డిజార్డర్‌’ అని ధనుష్‌ ‘త్రీ’ సినిమాలో ఒక డిజార్డర్‌ ఉంది. మూడ్స్‌ ఎప్పుడు ఎలా ఎందుకు మారతాయో తెలీదు. ఈ పిక్చర్‌ ఎందుకు ఆడలేదనేది మాత్రం డైరెక్టర్‌కి («ధనుష్‌ భార్యే) ఆ తర్వాత తెలిసే ఉంటుంది. జనానికి ఎక్కలేదు! ‘ఇంద్రుడు’ మూవీలో విశాల్‌కు ‘నార్కోలెప్సీ’. కాస్త ఎమోషనల్‌గా ఫీల్‌ అయితే చాలు అక్కడి కక్కడే నిద్రలోకి జారుకుంటాడు. జనానికి నిద్ర రాకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి విశాల్‌ బతికిపోయాడు. అతడే నిర్మాత మరి.

‘నేను మీకు తెలుసా’లో మంచు మనోజ్‌కి షార్ట్‌ టెర్మ్‌ మెమరీ లాస్‌ ఉంటుంది. ముందు రోజేం జరిగిందీ గుర్తుండదు. టేప్‌ రికార్డర్‌తో గెటాన్‌ అయిపోతుంటాడు.
ఇదిగో.. ఈ ‘తేడా’ల లిస్టులో వెతుక్కుంటూ పోతే ఇంకా ఒకట్రెండు సినిమాలు దొరుకుతాయి. కాలొంకర, చెయ్యొంకర ఉంటే తేడా అనం. మైండ్‌ ఆర్డర్‌ తప్పితేనే అది తేడా. కళ్లు లేని సినిమాలు, కాళ్లు లేని సినిమాలు, మరుగుజ్జు సినిమాలు, లడ్డు బాబు సినిమాలు.. మహామహులు నటించినవి తెలుగులో చాలా ఉన్నాయి. ఉన్నవి బోర్‌ కొట్టినప్పుడే లేనిది డిఫరెంట్‌ అవుతుంది. అందుకే వసంత కోకిలలు, స్వాతిముత్యాలు మెల్లిగా స్క్రీన్‌ మీదికి వచ్చాయి. అవీ పాతబడ్డాక డిజార్డర్‌ స్థాయి పెరిగి కామెడీలోకి టర్న్‌ అయింది. చూపు లేకపోవడం లైఫ్‌ ఛాలెంజ్‌. అది ఇన్‌స్పిరేషన్‌.  తేడాగా చూపించడం స్క్రీన్‌ ఛాలెంజ్‌. అది ఎంటర్‌టైన్‌మెంట్‌. దటీజ్‌ వై.. బాడీలోని తేడాల కన్నా, బ్రెయిన్‌లోని తేడాలు ఇప్పుడు మూవీ మార్కెట్‌లో సేల్‌ అవుతున్నాయి.

లైఫ్‌లో కష్టం ఉంటుంది. సంతోషం ఉంటుంది. కష్టాల్లోని కామెడీని చూపిస్తే మనిషికి ధైర్యం వస్తుంది. మనదీ ఒక కష్టమేనా అనిపిస్తుంది. బతగ్గలను అన్న నమ్మకం వస్తుంది. సినిమా దర్శకులు ఈ సూత్రాన్ని పట్టుకుని ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారు. ‘తేడా’లోని ఎంటర్‌టైన్‌మెంట్‌ని చిలికి, పైకి తెచ్చి, తలా ఇంత ముద్ద చేతిలో పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top