మీరిద్దరూ కలిస్తే బాగుంటుంది: అభిమానులు | Sakshi
Sakshi News home page

మీరిద్దరూ కలిస్తే బాగుంటుంది: అభిమానులు

Published Thu, May 3 2018 4:33 PM

Deepika Looks More Beautiful With Ranveer Than Ranbir - Sakshi

‘దీపిక పదుకొనె’... అందం, అభినయం, అదృష్టాల కలబోత. అందుకే ఈ ముద్దుగుమ్మతో నటించాలని బాలీవుడ్‌ పరిశ్రమలో పెద్ద హీరోల నుంచి యువ హీరోల వరకూ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ భామ షారుఖ్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి బడా హీరోలందరి సరసన నటించించారు. ఆయా చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు కూడా సాధించాయి. అంతేందుకు ఎన్నో వివాదాల మధ్య విడదలయిన ‘పద్మావత్‌’ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దీపికతో పాటు రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్ర విజయంలో దీపిక అందం, అభినయం ప్రాధాన పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.

ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ‘పొడుగుకాళ్ల’ సుందరి అప్పుడప్పుడు ఫ్యాషన్‌ షోలల్లో ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ చేస్తు హొయలొలికిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే కొన్ని రోజుల కిందటే ఈ భామ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనిష్‌ మల్హోత్ర నిర్వహించిన ‘మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షో’లో రణ్‌బీర్‌తో కలిసి ర్యాంప్ వాక్‌ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇది చూసి వారి అభిమానులు వీరిరువురిని మరోసారి బిగ్‌స్క్రీన్‌ మీద చూడాలని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే ఈ షోకు సంబంధించి రణ్‌బీర్‌తో ఉన్న ఫోటోలను దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలపై అభిమానులు భిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

కొందరు దీపిక మరోమారు రణ్‌బీర్‌తో కలిసి నటిస్తే బాగుంటుందని తెలపగా, మరికొందరు మీరిద్దరూ కలిసిపోయి మీ పాత బంధాన్ని కొనసాగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కామెంట్స్‌ చూసి రణ్‌వీర్‌ అభిమానులు.. ‘మీరు రణ్‌బీర్‌తో కన్నా రణ్‌వీర్‌ సింగ్‌తో ఉంటేనే చాలా అందంగా ఉంటార’ని కామెంట్‌ చేశారు. గతంలో రణ్‌బీర్‌ - దీపిక ప్రేమించుకుని తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత కూడా వీరివురు ‘యే జవాని హే దివాని’, ‘తమాషా’ చిత్రాల్లో కలిసి నటించారు.

ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకొనెల పెళ్లికి సంబంధించిన గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిరువురూ నవంబర్‌లో పెళ్లిపీటలెక్కనున్నట్లు వదంతులు షికారు చేస్తున్నాయి. కానీ దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement