సనోజ్‌ రాజ్‌ కేబీసీ11వ సీజన్‌ తొలి కోటీశ్వరుడు

Bihar Sanoj Raj Kaun Banega Crorepati 11th Season First Crorepati - Sakshi

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు జనాలు ఎంతో ఉత్సాహం చూపుతారు. ప్రస్తుతం కేబీసీ 11వ సీజన్‌ నడుస్తోంది. బిహార్‌కు చెందిన సనోజ్‌ రాజ్‌ అనే యువకుడు ఈ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా నిలిచాడు. శుక్రవారం ప్రసారం అయిన ఏపిసోడ్‌లో సనోజ్‌ రాజ్‌ 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. కోటి సొంతం చేసుకున్నాడు. 15వ ప్రశ్నకు ‘ఆస్క్‌ యాన్‌ ఎక్స్‌పర్ట్‌’ లైఫ్‌ లైన్‌ను వినియోగించుకుని కరెక్ట్‌ సమాధానం చెప్పాడు. ఆ తరువాత ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. దాంతో ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న మొదటి అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సనోజ్‌.

ఈ సందర్భంగా సనోజ్‌ మాట్లాడుతూ.. ‘16వ ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే రూ.7 కోట్లు గెలుచుకునేవాడిని. అయినా కోటి రూపాయలు సంపాదించాను కదా దానికే చాలా సంతోషంగా ఉంది. నా విజయాన్ని మా నాన్నకి అంకితం ఇస్తున్నాను. ఇక్కడ గెలుచుకున్న డబ్బులను కూడా మా నాన్నకే ఇస్తున్నాను. ఈ రోజు నేను గెలిచిందంతా మా నాన్నదే. ఆయన వల్లనే ఈ రోజు నేను ఈ విజయం సాధించగలిగాను. చిన్నతనంలో మా నాన్న కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఆయన చదువుకోలేక పోయారు. మా నాన్నకు చదువు విలువ బాగా తెలుసు. అందుకే మమ్మల్ని బాగా చదివించారు. ప్రస్తుతం నేను యూపీఎస్సీ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాను. త్వరలోనే ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపడతాను’ అన్నాడు.

ఇక బిగ్‌బీ గురించి మాట్లాడుతూ.. ‘ఇంత పెద్ద స్టార్‌ను తెర మీద చూడటమే కానీ నిజంగా కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఆయనను చూసినప్పుడు నేను చాలా టెన్షన్‌ పడ్డాను. కానీ బిగ్‌ బీ మాత్రం ఎన్నో ఏళ్లుగా నాతో పరిచయం ఉన్నట్లు చాలా సరదాగా మాట్లాడారు’ అని చెప్పుకొచ్చాడు సనోజ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top