ఆర్య చిత్రంలో గ్రాఫిక్స్‌ టెడ్డీబేర్‌

Arya Teddy Movie First Look Release - Sakshi

నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టెడ్డీ. ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్‌. ఈయన ఇంతకు ముందు టిక్‌ టిక్‌ టిక్‌ అనే స్పై చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ఈయన తాజా చిత్రం టెడ్డీలోనూ గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషాసైగల్‌ నటిస్తున్న చిత్రం ఇది. దీన్ని స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్‌ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్‌లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్‌ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్‌ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఆ సందేహాలను చిత్ర దర్శకుడిని అడిగి తెలుసుకుందాం!

ప్ర: ఈ చిత్రానికి టెడ్డీ అని పేరు నిర్ణయించడానికి కారణం?
జ: చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్‌కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తేనే టైటిల్‌ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్‌ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం.

ప్ర: ఇంతకు ముందు బ్యాంకు దోపిడీ. జోంబి, అంతరిక్షం నేపథ్యాల్లో చిత్రాలను తెరకెక్కించారు. మరి ఈ టెడ్డీ ఏ జానర్‌లో ఉంటుంది?
జ:  దీన్ని ఒక్క మాటలో పలానా జానర్‌ చిత్రం అని చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్‌కు సంబంధించిన పాత్ర ఉంటుంది.  దాన్ని రూపాన్ని గ్రాఫిక్స్‌లో మాత్రమే ఆవిష్కరించాల్సి ఉంటుంది.  అదే టెడ్డీబేర్‌ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. చిత్రంలో సెకెండ్‌ పాత్ర ఇదే. టెడ్డీబేర్‌ను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్నాం. ఈ టెడ్డీబేర్‌ ఫైట్స్‌ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు  కొత్త అనుభూతిని కలిగిస్తుంది. 

ప్ర: వివాహానంతరం ఆర్య, సాయేషాలను హీరోహీరోయిన్లుగా నటింపజేయాలన్న ఆలోచన గురించి?
జ: నిజం చెప్పాలంటే వారిద్దరినీ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి భయపడ్డాను. అయితే కథ విన్న వారం రోజుల్లోనే పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటి సాయేషా నటించడానికి అంగీకరించారు. 

ప్ర: అజర్‌బైజాన్‌ దేశంలో షూటింగ్‌ చేయడానికి కారణం?
జ:అది చాలా పురాతన దేశం. ఇప్పుడు అదే రష్యా. అప్పట్లో భారతీయ చిత్రాలను అక్కడి ప్రజలు ఎక్కువగా చూసేవారు. నటి సాయేషా ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలు అని తెలవగానే అక్కడి ప్రజలు సంతోషంగా దిలీప్‌కుమార్‌ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఒక బామ్మ నటుడు ఆర్యను పట్టుకుని అటూ ఇటూ ఊపేసింది. ఎందుకమ్మా? అని అంటే మదరాసు పట్టణం చిత్ర సీడీ చూపించి ఇందులో నటించింది నువ్వేగా అని అడిగింది. అంతగా ఇండియన్‌ చిత్రాలను ఇప్పటికీ య్యూట్యూబుల్లో  అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. 

ప్ర: చిత్ర నిర్మాత  జ్ఞానవేల్‌రాజా గురించి?
జ: టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్‌రాజాను కలిశాను. బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్‌ వంటివి ఏమీ అడగకుండా చిత్రం చేద్దాం అని చెప్పారు. ఇప్పటికీ ఇంత బడ్జెట్‌ అని నిర్ణయించలేదు. చిత్రానికి అవసరం అయిన వన్నీ సమకూర్చుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిర్మాణ సంస్థలో చాలా మైలురాయి చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఈ టెడ్డీ చిత్రం కూడా చేరుతుందని చెప్పగలను 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top