లిప్‌స్టిక్‌ వేసుకుంటేనే హీరోయిన్‌ కాదు!

Aditi Rao Hydari interview About Antariksham 9000 KMPH - Sakshi

‘‘సినిమాలో పాత్ర చిన్నదా, పెద్దదా అనే తేడా చూడను. ‘కెరీర్‌ స్టార్టింగ్‌లో మీరు చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు’ అని కొందరు అంటున్నారు. హాలీవుడ్‌ సినిమాలో అది చాలా కామన్‌. చిన్నా, పెద్దా అనే ట్యాగ్‌ కాదు.. ట్యాలెంట్‌ ముఖ్యం.  ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా, తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లేలా ఉండాలి. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో భాగమవ్వాలని భావిస్తుంటాను’’ అని అదితీ రావ్‌ హైదరీ అన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా అదితీ రావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించిన స్పేస్‌ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపీహెచ్‌’. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై క్రిష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు  నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్‌ కానున్న సందర్భంగా అదితీ రావ్‌ హైదరీ  పంచుకున్న విశేషాలు.

► ‘అంతరిక్షం’ సినిమాలో రియా అనే వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌) పాత్ర పోషించాను. ఈ పాత్రకు సంబంధించి శిక్షణ కోసం చాలా కష్టపడ్డాం. శిక్షణలో భాగంగా పిల్లిమొగ్గలేయడం (ముందుకు,వెనక్కి) గాల్లో స్విమ్‌ చేయడం నేర్చుకున్నాను. శిక్షణ తీసుకునేప్పుడు ‘నవాబ్‌’ సినిమా షూటింగ్‌ కూడా జరిగేది. పొద్దునే ప్రాక్టీస్, సాయంత్రం చెన్నె వెళ్ళి షూటింగ్‌ చేసేదాన్ని. చిన్నప్పుడు మా స్కూల్‌కి ఆస్ట్రోనాట్‌ రాకేశ్‌ శర్మ వచ్చి, తన అనుభవాలు షేర్‌ చేసుకునేవారు. ఈ సినిమా చేస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి.

► సినిమాలో వ్యోమగామి (ఆస్టోనాట్‌) అవుదాం అని స్పేస్‌ సెంటర్‌లో ఇన్‌టర్న్‌గా జాయిన్‌ అవుతాను. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌గా ట్రెయిన్‌ అవుతాను. సినిమాలో పాత్రల గురించి పూర్తిగా చెప్పేయడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఇదివరకు ప్రేక్షకులకు సినిమా గురించి ఎక్కువగా తెలిసేది కాదు. సినిమాలో అన్నీ ఆశ్చర్యంగా తోచేవి. ఇప్పుడు అన్నీ ముందే తెలుస్తుంటే ‘సర్‌ప్రైజింగ్‌ ఫ్యాక్టర్‌’ తగ్గుతుందని నా ఫీలింగ్‌.

► జీరో గ్రావిటీ సన్నివేశాలన్నీ  కూడా తాళ్లతో కట్టేసుకుని షూట్‌ చేశాం. నేను, వరుణ్, సత్యదేవ్, రాజా నలుగురం స్పేస్‌ సీన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నది. వాళ్లందరిలో నేనే చాలా తక్కువ వెయిట్‌. నాలా తక్కువ బరువుంటే ఏ ఇబ్బందీ ఉండదు అని వాళ్లతో అనేదాన్ని (నవ్వుతూ). నాకైతే నా హెల్మెట్‌ చాలా బరువుగా ఉండేది. అది ధరించేప్పుడు చాలా నొప్పిగా ఉండేది. ఒకసారి హెల్మెట్‌ పెట్టుకుంటే మెడ దగ్గర ‘టక్‌’మని సౌండ్‌ వినిపించింది. గాయమైంది. డాక్టర్‌ సుమారు 10 రోజులు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలన్నారు. నా కోసం టీమ్‌ అన్ని రోజులు ఎదురుచూడటం కరెక్ట్‌ కాదనుకున్నాను. సీరియస్‌గా ఫిజియోథెరపీ చేయించుకుని రోజుకు 4 పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకొని జస్ట్‌ 2 రోజుల్లో షూటింగ్‌లో జాయినయ్యా.

► సంకల్ప్‌ రెడ్డి స్క్రిప్ట్‌ చెపినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా చేయాలంటే ముంబై, హైదరాబాద్‌ వస్తూ పోతుండాలి. అది ప్రొడక్షన్‌కు ఇబ్బంది అన్నాను. ఆ తర్వాత ‘సమ్మోహనం’ చేస్తున్న సమయంలో పూర్తి కథ రెడీ అన్నారు. ఇప్పటి వరకూ అంతరిక్షానికి వెళ్లిన మహిళా ఆస్ట్రోనాట్స్‌ మన దేశానికి చెందిన వారే. అప్పుడే ఈ పాత్ర చేయాలనుకున్నాను.  

► ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెబుదాం అనుకున్నాను. కానీ మా టీమ్‌ వేరే వాళ్లతో డబ్‌ చేయించేశారు. వరుణ్‌ తేజ్‌ ప్రాజెక్ట్స్‌ ఎంపిక బావుంది. లావణ్యతో నాకు కాంబినేషన్‌ సీన్స్‌ లేవు. వరుణ్‌ తేజ్‌కి సంబంధించిన లవ్‌స్టోరీలో ఆమె ఉంటారు.

► నా దృష్టిలో యాక్టర్స్‌ అనేవాళ్లు చిన్నపిల్లలు. కెమెరా ఆన్‌ అయితే చాలా ఆనందం వచ్చేస్తుంది. వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతాం. చిన్నపిల్లల్ని ప్లే గ్రౌండ్‌లో వదిలిపెట్టినట్లే. ఎంతసేపు అక్కడున్నా అలసిపోరు. మేం కూడా అంతే. కెమెరా ముందు నుంచి బయటకు రాగానే అలసిపోతాం.  

► నాకు నటించడం రాదు. ఆ టైమ్‌లో ఆ సందర్భానుసారం ఫీల్‌ అవ్వడమే వచ్చు. డ్యాన్స్‌ మాత్రమే నేర్చుకున్నాను. యాక్టింగ్‌కు సంబంధించిన రూల్స్‌ కూడా నాకు తెలియవు. నటనకు సంబంధించిన ప్రాసెస్‌ వివరించడం కష్టం అనుకుంటున్నాను.

► మన సేఫ్టీని మనమే క్రియేట్‌ చేసుకోవాలి. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే. నా అదృష్టమేంటంటే 99 శాతం చాలా మంచి మనుషులతో వర్క్‌ చేశాను. ‘సమ్మోనం’ తర్వాత మళ్లీ గ్లామర్‌ పాత్ర ఎందుకు చేయలేదని కొందరు అడిగారు. నా దృష్టిలో ఆస్ట్రోనాట్‌ని మించిన హీరోయిన్‌ లేదు. దేశం కోసం అంత దూరం ప్రయాణించడం గ్రేట్‌. వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. లిప్‌స్టిక్‌ వేసుకుంటేనే హీరోయిన్‌ కాదు. కేవలం అందమైన ముఖం ఉంటే కొన్ని రోజుల్లో బోర్‌ కొట్టేయొచ్చు. టాలెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చి కొత్త కొత్త పాత్రలు చేస్తూ ఉంటే చాలా ఏళ్లు కొనసాగొచ్చు. మన యాటిట్యూడ్, వర్క్‌ మనల్ని హీరోయిన్‌ని చేస్తుంది.

► నెక్ట్స్‌ ధనుశ్‌తో ఓ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాను. ధనుశ్‌ నటిస్తూ, డైరెక్ట్‌ చేస్తున్నారు. నాగార్జునగారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. తమిళంలో దర్శకుడు మిస్కిన్‌తో ‘సైకో’ అనే సినిమా చేస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top