
పెబ్బేరు (కొత్తకోట): పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ నెల 10న బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి నుంచి 5 తులాల బంగారం చోరీ చేసిన మహిళలను సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా గుర్తించారు. వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన బాధితురాలు చంద్రకళ పెబ్బేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్టాండ్‌లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో శుక్రవారం పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో వనపర్తికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరి మహిళలను అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డు మార్కండేయరెడ్డి గుర్తించారు.
సీసీ టీవీ పుటేజీలో ధరించిన చీరలే ఉండడంతో ఆ మహిళలు బంగారు చోరీ చేసిన వారిగా నిర్ధారించుకుని ఆర్టీసీ డ్రైవర్ సాయంతో బస్సును పోలీసుస్టేషన్ వద్ద నిలిపి అదుపులోకి తీసుకున్నారు. వీరిని కొత్తకోట సీఐ సోంనారాయణసింగ్, ఎస్‌ఐ ఓడీ రమేష్‌లు విచారించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బీచుపల్లి ఆంజనేయస్వామ ఆలయంలో భక్తుల కాటేజీలో గదిని అద్దెకు తీసుకుని రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. బీచుపల్లి వద్ద ఉన్న గది తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లను నిఘా పెట్టగా మరో తాళం చెవితో శనివారం గది తెరిచేందుకు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను కొత్తకోట సీఐ కార్యాలయానికి తరలించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.