వైకల్యం వారి ప్రేమకు అడ్డుకాలేదు

Shinu Varghese And Nisha Wheel Chair Love, Kerala - Sakshi

వారిద్దరి మధ్య ప్రేమ చాలా ప్రత్యేకమైనది. వీల్‌ఛైర్‌ లేకుండా నడవలేని దివ్యాంగులు అయినా వైకల్యం వారి ప్రేమకు అడ్డుకాలేదు. తొలిచూపులోనే ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. అందరు ప్రేమికుల్లానే వారికీ ఆటంకాలు ఎదురయ్యాయి. వైకల్యం వెక్కిరిస్తే.. ప్రేమతో సమాధానం చెప్పారు! పెళ్లితో ఒక్కటయ్యారు. 

ఆమె పేరు నిశా! నేషనల్‌ వీల్‌ఛైర్‌ బాస్కెట్‌ బాల్‌ టీం మెంబర్‌. అతడి పేరు షిను వర్గీస్‌ ట్యూషన్‌ మాస్టర్‌. గురువాయూర్‌లోని కొట్టపాడి సేయింట్‌ లేజర్స్‌ చర్చిలో ఇద్దరి చూపులు కలిశాయి. తర్వాత దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షిను ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతున్నంత సేపు అతడికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ, అది ప్రేమ అనిమాత్రం అనుకోలేదు. ఆమె తనకు ప్రత్యేకమైనదని గుర్తించాడు. అదే సమయంలో అతడికి ఓ అనుమానం కూడా వచ్చింది. దివ్యాంగులైన తమకు ప్రేమ ఓ సవాలుగా మారుతుందని. కానీ, తమ బలహీనతే తమ మధ్య బంధాన్ని ధృడంగా ఉంచుతుందని ఆశించాడు. స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి హెచ్చరికలు లెక్కచేయలేదు. వారి మాటలతో తనకు పనిలేదనుకున్నాడు. ఆమె మాట కోసం ఎదురుచూశాడు.

అయితే నిశా జీవితం అతనికంటే కొద్దిగా ప్రత్యేకమైనది. ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వీల్‌ఛైర్‌కు పరిమితం చేసింది. ఆమె కృంగిపోలేదు. వీల్‌ఛైర్‌లోనే ఉంటూ బాస్కెట్‌బాల్‌ నేర్చుకుంది. షినూ రాక ఆమె జీవితాన్ని ఆనందమయం చేసేసింది. నిశా అభిప్రాయాలకు అతడు గౌరవాన్నిచ్చాడు. ఏడాది పరిచయం తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వైకల్యం వారిముందు పెను సవాళ్లను ఉంచింది. అయినా అన్నింటిని దాటుకుని మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ప్రేమ జవానుల్లా జీవితపు పెను సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top