కేఈ ధ్రుతరాష్ట్రుడిగా మారారు | Sakshi
Sakshi News home page

కేఈ ధ్రుతరాష్ట్రుడిగా మారారు

Published Sun, Dec 31 2017 11:44 AM

YSRCP B Y Ramayya Fires On  tdp govt - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాష్ట్ర రాజకీయాల్లో భీష్మాచార్యుడు అనుకుంటే ధ్రుతరాష్ట్రుడిగా మారారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న రీతితో తమ్ముడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకుని సీఎం చంద్రబాబునాయుడు తప్పులను కప్పిపుచ్చేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భిక్షతో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని పట్టుకొని అది తమ బలం అనుకుంటే పొరపాటన్నారు.

 సీఎం చంద్రబాబునాయుడు సమకాలికుడినని చెప్పుకునే కేఈ ఆయన చేస్తున్న రాజకీయ వ్యభిచారాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జిల్లాలో కేఈ కుటుంబానికి మంచి ఆదరణ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం స్వతంత్ర అభ్యర్థులతో ఎందుకు రాజీ కావాల్సి వచ్చిందో ప్రజలకు  సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ మాజీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అంటే మండిపడే ఆయన ఎమ్మెల్సీ కోసం రాజీపడడం నిజం కాదా అని ప్రశ్నించారు.  ఎమ్మెల్సీ పదవిని అడ్డుపెట్టుకొని బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు జిల్లాలో నిజంగా టీడీపీ బలం ఉందనుకుంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆయన డిప్యూటీ సీఎంకు సవాల్‌ విసిరారు.

విలువలతో కూడిన రాజకీయాల కోసం వైఎస్‌ఆర్‌సీపీ లోకి... 
పదవుల కోసం పాకులాడే కేఈ కుటుంబం ఎదుటి వారిపై నిందలు వేయడం సిగ్గుచేటని బీవై రామయ్య మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తనను పదవుల కోసం కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి వచ్చానని విమర్శించడం తగదన్నారు.  ఆదర్శ రాజకీయాలు చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో నడవాలని తాను వైఎస్‌ఆర్‌సీపీలో చేరానన్నారు. ప్రజల కోసం, నీతివంతమైన రాజకీయాలు చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీలో తాను చేరడం బిచ్చం ఎత్తుకోవడం ఎలా అవుతుందో ఆయనే చెప్పాలన్నారు.   ఎంపీ టిక్కెట్‌ కోసం డాక్టర్‌ పార్ధసారథి, పత్తికొండలో రాజకీయాల కోసం జెడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట రాముడుపై దాడి చేసిన చరిత్ర కేఈ కుటుంబానిదన్నారు. 

Advertisement
Advertisement