పసి హృదయం.. ప్రచార కష్టం!

tdp government using school childrens for janmabhoomi compaign - Sakshi

నాడు వ్యక్తిగత మరుగుదొడ్లంటూ ర్యాలీలు

నేడు జన్మభూమి పేరుతో బాలల హక్కులకు భంగం

సెలవు రోజున 5కే రన్‌ నిర్వహించడంపై విమర్శలు

సంక్షేమ పథకాలపై విద్యార్థులతో ప్రచారం

ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

పాపం..పుణ్యం.. ప్రపంచ మార్గం...ఏమీ ఎరుగని చిన్నారులు వారు..వాన కురిస్తే..హరివిల్లు విరిస్తే అంతా తమకే అనుకునే అమాయకత్వం వారిది.. అలాంటి అమాయకత్వాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. సంక్షేమ పథకాల ప్రచారానికి ప్రభుత్వ బడుల్లోని చిన్నారులను వాడుకుంటోంది. చిన్నారులతో డ్యాన్స్‌లు వేయిస్తోంది..ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇదీ చాలక సెలవులను రద్దు చేసి ఎర్రటి ఎండలో పరుగులూ తీయిస్తోంది. అయ్యో..పాపం..లేత మనసులకు ఇంత కష్టమా..? విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు కావడం లేదు? ఇదేం పాలన అంటూ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

కర్నూలు సిటీ: పాఠశాల విద్యార్థులను ప్రభుత్వం.. ప్రచాకర్తలుగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జన్మభూమి సభల్లో చిన్నారులను వినియోగించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.    విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలకు సెలవు ఉన్న రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తరగతులు కానీ, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను, వారికి చదువు చెబుతున్న ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రచారకర్తలుగా విద్యార్థులను వినియోగించుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థులను మాత్రమే భాగస్వాములను చేసి, కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిని మినహాయించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలి. లేదంటే పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేయించుకోవాలి. విద్యార్థులను చదువులకు దూరం చేసి తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.   

ప్రచార ఆర్భాటంలో విద్యార్థులే సమిధలు!
స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం సర్వే చేయించింది. విద్యార్థులతో ఓడీఎఫ్‌పై ర్యాలీలు, ఇంటింటి సర్వేలు చేయించారు. వాస్తవానికి పాఠశాలల్లోనే మరుగుదొడ్లు నిర్మించలేదనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. బాలల హక్కులపై గతేడాది నవంబరు నెలలో చేపట్టి ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆ రోజున ఉదయం నుంచి ఎలాంటి అల్పాహారం ఇవ్వకుండా ర్యాలీ పేరుతో విద్యార్థులను రోడ్లపైకి తీసుకువచ్చారు. ర్యాలీ, సమావేశం ముగిసిన తరువాత వారిని స్కూళ్లకు చేర్చకపోవడంతో  తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను, ఉపాధ్యాయులను భాగస్వాములను చేశారు. ఈ నెల 5వ తేదీన విద్యా వికాసం, ఓడీఎఫ్‌ కార్యక్రమాల గురించి  విద్యార్థులతో ఎండలోనే ర్యాలీలు చేయించారు. సెలవు రోజు కూడా వదిలి పెట్టకుండా ఆదివారం.. విద్యార్థులతో 5కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయమే  రోడ్లపైకి వచ్చి 5కె రన్‌లో పాల్గొనాల్సి రావడంతో కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి పేద విద్యార్థులను వాడుకోవడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అభ్యంతరం చెబుతున్నారు.   

చిన్నారి చేత జేజేలు!
ఆత్మకూరురూరల్‌: సర్వపాధారణంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ ప్రసంగం చివర్లో ‘జై తెలుగుదేశం .. జై జన్మభూమి’ అని నినాదాలిస్తారు. ఓ చిన్నారి చేత ఈ నినాదాన్ని బట్టీ పట్టించి సీఎంకు వినిపించడం టీడీపీ నేతలకే చెల్లింది. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సభలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జూపాడుబంగ్లా ఏపీ గురుకుల పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థితో మాట్లాడించారు. ఈ సందర్భంలో ఆ విద్యార్థి తాను బట్టీ పట్టిన ఉపన్యాసం ముగిస్తూ జై తెలు గు దేశం... జై జన్మభూమి అని నినాదమిచ్చాడు. ఇది చూస్తున్న సభలో పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఇంతటి ప్రచార ఆర్భాటమా అని   విసుకున్నారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top