ఒత్తిడిని ఓడించలేక...  | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని ఓడించలేక... 

Published Sat, Dec 16 2017 8:02 AM

stress in women employes

సాక్షి, బెంగళూరు:  ఇంటా, బయటా పనుల హడావుడిలో గజిబిజి జీవితాన్ని సాగిస్తున్న నేటి తరం మహిళలు పనిఒత్తిళ్ల కారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ కారణంగానే ఉద్యోగినుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని అసోచామ్‌ సంస్థ ఇటివల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అసోచామ్‌ సంస్థ తన సర్వేలో భాగంగా బెంగళూరు నగరంలో అటు గృహిణిగా, ఇటు ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన  ఆందోళన కలిగించే కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.

లైఫ్‌ సైటల్‌ డిసీజెస్‌ అధికం...
సర్వేలో భాగంగా నగరంలోని వివిధ కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న 2,800 మంది ఉద్యోగినుల వివరాలను సేకరించారు. వీరిలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగినులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 32 నుండి 58 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా వీరంతా ఒబేసిటీ, డయాబిటీస్, హైపర్‌టెన్షన్‌ వంటి లైఫ్‌            సైటల్‌ డిసీజెస్‌తో పాటు వెన్నెముకలో నొప్పి, గుండె, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఇక సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కాల్షియం కొరత, రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఉద్యోగినుల్లో ఇంతమంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడడానికి కారణాలు తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే వీరంతా కనీసం డాక్టర్‌ను కలిసేందుకు కూడా సమయం లేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని అసోచామ్‌ సర్వే వెల్లడించింది. ఇక మరికొంతమందేమో తమ ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. కాగా ఇంటిని నడిపేందుకు తాము ఉద్యోగం చేయాల్సి వస్తోందని, వైద్యం చాలా ఖరీదవుతున్న ప్రస్తుత రోజుల్లో తాము వైద్య పరీక్షల కోసం ప్రతిసారీ డబ్బు వెచ్చించడం అంటే కష్టమని మరికొందరు మహిళలు ఈ సర్వేలో తెలిపారు. 

భయం కూడా ఒక కారణమే...
ఉద్యోగినులు ఇలా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడానికి గల ప్రముఖ కారణాల్లో ఉద్యోగ భయం కూడా ఒకటని అసోచామ్‌ నివేదిక వెల్లడించింది. నగరంలోని వివిధ కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. సరైన సమయానికి తిండి, సరైన పనివేళలు కూడా కార్పొరేట్‌ సంస్థల్లో కనిపించడం లేదంటే నమ్మకతప్పదు. ఇక ఉద్యోగ బాధ్యతల్లో ఇచ్చిన లక్ష్యాలను అందరికన్నా ముందుగా పూర్తి చేయాలని, లేదంటే తమ ఉద్యోగాలను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అనే భయం మహిళలను వెంటాడుతోంది. అందుకే తమ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అటు ఇళ్లు, ఇటు ఆఫీసు పనులతో నిత్యం సతమతమవుతున్నారు. దీంతో వారిలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. 

వైద్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు...
సాధారణంగా ఒక గృహిణిగా ఉండడంతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించే మగువల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అది కూడా 30 ఏళ్లు దాటితే ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. అందుకే ఏడాదికోసారి తప్పనిసరిగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా స్తన, గర్భాశయ క్యాన్సర్‌లను చాలా వరకు నిరోధించవచ్చు. ఇక ఎంత పని ఒత్తిడితో ఉన్నా కూడా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా లైఫ్‌సైటల్‌ డిసీజెస్‌ను అరికట్టవచ్చు. ఇంటిని నడిపే మహిళ ఆరోగ్యంలో సమస్యలు తలెత్తితే ఆ ప్రభావం కుటుంబమంతటిపైనా పడుతుందని మరిచిపోవద్దు.
        -డాక్టర్‌ ఫాతిమా, కర్ణాటక క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి  

Advertisement
Advertisement