ఎస్సీ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు

Employment opportunities for SC youth with training - Sakshi

     ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ సరికొత్త కార్యాచరణ 

     వివిధ రంగాల్లో శిక్షణ.. పలు కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం

     వచ్చే మార్చి నాటికి 10వేల మందికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళిక 

     శిక్షణ కార్యక్రమాలకు రూ.169 కోట్లు కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల్లో భాగంగా 2017–18 ఏడాదిలో ఆ శాఖ రూ.169 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ప్రధానంగా ఎస్సీ యువతులకు ఎయిర్‌హోస్టింగ్‌లో శిక్షణతో కూడిన ఉపాధి కల్పించేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌తో ఎస్సీ కార్పొరేషన్‌ అవగాహన కుదుర్చుకుంది. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలు సైతం కల్పించనుంది 

తొలివిడత 50 మందికి... 
ఎయిర్‌ హోస్టింగ్‌ శిక్షణలో ప్రస్తుతం 50 మందికి శిక్షణతో కూడిన ఉపాధి ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఇందులో శిక్షణ నిమిత్తం 200 పైగా దరఖాస్తులు రాగా.. వీటిలోంచి 50 మందిని ఈనెలాఖర్లోగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. తొలివిడత కార్యక్రమం విజయవంతంగా పూర్తయితే మరికొందరికి సైతం ఇదే తరహాలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని రంగాల్లోనూ శిక్షణ 
ఎయిర్‌ హోస్టింగ్‌తో పాటు మరిన్ని రంగాల్లోనూ శిక్షణతో కూడిన ఉపాధి కల్పించేందుకు ఆ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది పదివేల మందికి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి.. వారికి అత్యాధునిక కుట్టుమిషన్లు సైతం అందించనుంది. సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు 3నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు న్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమం మొదలైంది. తొలివిడత 27 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 23 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మెడికల్‌ రంగంలో ఉపాధి కల్పనకు ఆ శాఖ అపోలో హాస్పిటల్స్‌తో ఎంఓయూ కుదుర్చుకోనుంది. వీటితో పాటు హౌస్‌కీపింగ్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత కోర్సులు, వెబ్‌ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్‌ తదితర కోర్సుల్లో శిక్షణతో కూడిన ఉపాధి కల్పనకు నిధమ్, కెల్ట్రాన్, ఎంఎస్‌ఎంఈ సంస్థలతో అవగాహన కుదుర్చుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017–18 ఏడాది ముగిసేనాటికి కనీసం పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఘనంగా దున్నపోతుల వేడుక
కర్ణాటకలోని మంగళూరు తీరప్రాంత సంప్రదాయ క్రీడ అయిన కంబళ ఘనంగా పునఃప్రారంభమైంది. శనివారం మంగళూరు సమీపంలోని కడళకెరె గ్రామంలో దున్నపోతులను బురద మడుల్లో పరిగెత్తించి, గెలిచిన వాటి యజమానులను సన్మానించారు. కంబళలో జంతుహింస జరుగుతోందని ఆరోపిస్తూ కొన్ని సంఘాలు ఏడాది కిందట హైకోర్టులో కేసులు వేయడంతో క్రీడను ఆపివేశారు. రాష్ట్ర సంస్కృతిని అణచివేయరాదని గతేడాది చివర్లో ప్రముఖులు, ప్రజలు కంబళకు మద్దతుగా నిరసనలు చేపట్టడం తెలిసిందే. చివరకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి రాష్ట్రపతికి పంపగా ఇటీవల ఆమోదం లభించింది. దీంతో శనివారం రెట్టించిన ఉత్సాహంతో కంబళను నిర్వహించారు.
– సాక్షి, బెంగళూరు

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top