'అమెరికాలో ఖైదీలకు శుభవార్త' | US police chiefs call for reducing prison population | Sakshi
Sakshi News home page

'అమెరికాలో ఖైదీలకు శుభవార్త'

Oct 22 2015 11:05 AM | Updated on Apr 4 2019 3:25 PM

'అమెరికాలో ఖైదీలకు శుభవార్త' - Sakshi

'అమెరికాలో ఖైదీలకు శుభవార్త'

అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలోనే కాదు నేరాలు, నేరగాళ్ల సంఖ్యలోనూ అగ్రరాజ్యమే.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలోనే కాదు నేరాలు, నేరగాళ్ల సంఖ్యలోనూ అగ్రరాజ్యమే. జైళ్లలోని ఖైదీలను పోషించడానికే ఆ దేశం సంవత్సరానికి 80 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఒక ఖైదీకి సగటున ఏడాదికి 60,000 డాలర్లను ఖర్చు చేస్తున్నారు. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో 5 శాతంగా ఉన్న అమెరికా జనాభా.. ఖైదీల సంఖ్యలో మాత్రం 25 శాతంగా ఉన్నట్లు గుర్తు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతుంది.

అమెరికా జనాభా 1980 నుండి ఇప్పటివరకు 30 శాతం పెరిగితే, ఖైదీల సంఖ్యలో మాత్రం ఈ పెరుగుదల 800 శాతంగా నమోదైంది. అమెరికాలోని జైళ్లు ఎక్కువగా.. మాదకద్రవ్యాలకు బానిసైన వారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, చిన్న ఘటనలలో హిసాత్మకంగా ప్రవర్తించిన వారితో నిండిపోయి ఉన్నాయి. ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను.. సమాజంలో ఉత్పాదక వనరులుగా మార్చుకునే దిశగా ఆగ్రరాజ్యం అడుగులేస్తుంది.


గత శనివారం అధ్యక్షుడు బరాక్ ఒబామా తన రేడియో సందేశంలో దేశంలో జైళ్లను సంస్కరించాల్సిందిగా పిలుపునిచ్చారు. నేరాల యొక్క తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేయాలని ఒబామా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలోని సుమారు 130 మంది పోలీసు ఉన్నతాధికారులు, ఉన్నత న్యాయాధికారులు ఖైదీల రేటును తగ్గించే దిశగా సంస్కరణలు చేపట్టడానికి గురువారం సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా చికాగో పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఖైదీల సంఖ్యతో పాటు నేరాల రేటును అదుపులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం తక్కువగా ఉన్నటువంటి ఖైదీలను గుర్తించి విడుదల చేసేందుకు అమెరికా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జైళ్ల సంస్కరణల్లో భాగంగా నవంబర్ నెలలో వేల సంఖ్యలో ఖైదీలను విడుదల చేయడానికి అగ్రరాజ్యం సమాయత్తమైంది.

Advertisement
 
Advertisement
Advertisement