ముడి చమురు ధర రికార్డు  పతనం

US oil prices turn negative as demand dries up - Sakshi

 క్రూడాయిల్ ధర కనీవినీ ఎరుగని స్థాయికి పతనం 

మైనస్‌లోకి ముడి చమురు ధర

 కరోనా మహమ్మారి తో అతలాకుతలమవుతున్న మార్కెట్లు

స్థంభించిన రవాణా, కీణించిన  పెట్రో డిమాండ్

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో ముడి చమురు ధరలు  పాతాళానికి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా  కరోనా మహమ్మారి కారణంగా  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముడిచమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతున్న అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా  ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో మైనస్‌లోకి వెళ్లిపోయాయి.  డబ్ల్యూటీఐ క్రూడ్ ధర ఏకంగా మైనస్ 38 శాతం కుప్పకూలింది. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోలుకుని 1.10 డాలర్ల వద్ద  ఉంది. 

వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్‌) గత శుక్రవారం ఒక్క బ్యారెల్‌కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. సోమవారం ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్‌ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్‌ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్‌ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 22.25 బ్యారెల్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది. మే, జూన్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ల ధరల తేడా (స్ప్రెడ్‌) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్‌లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి. మే డబ్ల్యూటీఐ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌లు నేడు(మంగళవారం) ఎక్స్‌పైర్‌ అవుతాయి. ఇక బ్రెంట్‌ క్రూడ్‌ 6 శాతం(1.76 డాలర్లు) క్షీణించి 26.32 డాలర్లకు చేరింది. (ఆయిల్ దెబ్బ, మార్కెట్ల పతనం)

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.  దీంతో డిమాండ్ భారీగా క్షీణించి, నిల్వలు  పేరుకు పోతూ  వచ్చాయి.  దీనికితోడు సౌదీ అరేబియా , రష్యా మధ్య ధరల యుద్ధం కారణంగా ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది.  ఈ నెల ప్రారంభంలో రోజుకు దాదాపు 10 మిలియన్ బారెల్స్ ఉత్పత్తిని తగ్గించే ఒప్పందం కుదుర్చుకోవడంతో  కాస్త ఈ వివాదం సద్దుమణిగాయి.  అయితే లాక్‌డౌన్‌పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో డిమాండ్  ఏ మాత్రం పుంజుకోక,  చమురు సంస్థలు మిగులు సరఫరాను నిల్వ చేయడానికి ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్న పరిస్థితి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top