కరువును తట్టుకునే గోధుమ

UK varsity develops wheat plants that can survive drought conditions - Sakshi

లండన్‌: వాతావరణ మార్పుల కారణంగా వచ్చే కరువు పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకునే గోధుమ వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇవి నీటిని కూడా పొదుపుగా వాడుకునేలా జన్యు మార్పులు చేశారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త గోధుమ వంగడాలను రూపొందించారు. కొత్త వంగడాల్లో తక్కువ పత్ర రంధ్రాలు ఉండేలా జన్యు మార్పులు చేశారు. దీంతో తక్కువ నీటిని వినియోగించుకోవడంతో పాటు మంచి దిగుబడులు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కోసం 80 నుంచి 90 శాతం మంచి నీరు అవసరం అవుతోంది.

ఒక కిలో గోధుమ ఉత్పత్తి చేసేందుకు ఏకంగా 1,800 లీటర్ల నీరు అవసరం పడుతోంది. వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో నీటి ఎద్దడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇలాంటి వంగడాలు ఎంతో అవసరమని, పైగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా ఆహారపు అవసరాల కోసం రైతులు మరింత ఉత్పత్తి చేయాలని పరిశోధకులు అంటున్నారు. అన్ని మొక్కల్లాగే గోధుమ మొక్కలు కూడా నీటి ఆవిరిని నియంత్రిస్తుంటాయి. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు తెరుచుకుని ఆవిరి బయటికి వెళ్తుంది. అదే కరువు పరిస్థితుల్లో పత్రరంధ్రాలు మూసుకుపోయి నీరు బయటికి వెళ్లకుండా నియంత్రించుకుంటాయి. అదే పత్ర రంధ్రాలు తక్కువగా ఉంటే నీటిని జాగ్రత్తగా వాడుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top