దేవుడు లేడు.. విధీ లేదు | There is NO GOD, claims theoretical physicist | Sakshi
Sakshi News home page

దేవుడు లేడు.. విధీ లేదు

Oct 18 2018 2:55 AM | Updated on Oct 18 2018 12:04 PM

There is NO GOD, claims theoretical physicist - Sakshi

లండన్‌: ‘అసలు దేవుడే లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. మన తలరాతను ఎవరూ నిర్ణయించరు. దీనివల్ల నాకు తెలిసిందేమంటే స్వర్గమనేది లేదు. మరణానంతరం జీవితం లేదు. కేవలం మనం కోరుకోవడం వల్లే మరణానంతరం కూడా జీవితం ఉంటుందని అనుకుంటున్నాం. వీటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్‌ ముందు ఇలాంటివన్నీ తేలిపోతాయి’ అని దివంగత విఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ తన చివరి పుస్తకంలో పేర్కొన్నారు. ‘బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు బిగ్‌ క్వశ్చన్స్‌’ పేరిట తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని జాన్‌ ముర్రే అనే సంస్థ ప్రచురించింది. ‘నా లాంటి వికలాంగులు దేవుడి శాపానికి గురయ్యారని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు.

కానీ ఇలాంటి నమ్మకాల్ని ప్రకృతి ధర్మాలు వివరిస్తాయని భావిస్తున్నా’ అని ‘ఈజ్‌ దేర్‌ గాడ్‌?’ అనే చాప్టర్‌లో హాకింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాదిరిగా తాను కూడా ‘దేవుడు’ అనే పదాన్ని ఓ వ్యక్తికి కాకుండా ప్రకృతి ధర్మాలకు ఆపాదిస్తానని చెప్పారు. ఈ శతాబ్దం చివరి నాటికి దేవుడి మనుసులో(ప్రకృతిలో లోతుల్లో) ఏముందో తెలిసిపోతుందని అన్నారు. ఈ విశ్వం అందరికీ ఒకటేనని, దాన్ని సృష్టించేందుకు దేవుడు అక్కర్లేదని చెప్పారు. హాకింగ్‌ ఆలోచనలు, హాస్య చతురత, సిద్ధాంతాలు, రచనల్ని పొందుపరచిన ఈ పుస్తకాన్ని ఆయన వారసత్వ సంపదగా భావిస్తామని ఆయన కూతురు ల్యూసీ అన్నారు. ఈ పుస్తకం రాయల్టీ హక్కుల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగం మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌ అసోసియేషన్, స్టీఫెన్‌ హాకింగ్‌ ఫౌండేషన్‌కు వెళ్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement