breaking news
no god
-
దేవుడు లేడు.. విధీ లేదు
లండన్: ‘అసలు దేవుడే లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. మన తలరాతను ఎవరూ నిర్ణయించరు. దీనివల్ల నాకు తెలిసిందేమంటే స్వర్గమనేది లేదు. మరణానంతరం జీవితం లేదు. కేవలం మనం కోరుకోవడం వల్లే మరణానంతరం కూడా జీవితం ఉంటుందని అనుకుంటున్నాం. వీటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్ ముందు ఇలాంటివన్నీ తేలిపోతాయి’ అని దివంగత విఖ్యాత భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకంలో పేర్కొన్నారు. ‘బ్రీఫ్ ఆన్సర్స్ టు బిగ్ క్వశ్చన్స్’ పేరిట తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని జాన్ ముర్రే అనే సంస్థ ప్రచురించింది. ‘నా లాంటి వికలాంగులు దేవుడి శాపానికి గురయ్యారని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. కానీ ఇలాంటి నమ్మకాల్ని ప్రకృతి ధర్మాలు వివరిస్తాయని భావిస్తున్నా’ అని ‘ఈజ్ దేర్ గాడ్?’ అనే చాప్టర్లో హాకింగ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాదిరిగా తాను కూడా ‘దేవుడు’ అనే పదాన్ని ఓ వ్యక్తికి కాకుండా ప్రకృతి ధర్మాలకు ఆపాదిస్తానని చెప్పారు. ఈ శతాబ్దం చివరి నాటికి దేవుడి మనుసులో(ప్రకృతిలో లోతుల్లో) ఏముందో తెలిసిపోతుందని అన్నారు. ఈ విశ్వం అందరికీ ఒకటేనని, దాన్ని సృష్టించేందుకు దేవుడు అక్కర్లేదని చెప్పారు. హాకింగ్ ఆలోచనలు, హాస్య చతురత, సిద్ధాంతాలు, రచనల్ని పొందుపరచిన ఈ పుస్తకాన్ని ఆయన వారసత్వ సంపదగా భావిస్తామని ఆయన కూతురు ల్యూసీ అన్నారు. ఈ పుస్తకం రాయల్టీ హక్కుల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగం మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, స్టీఫెన్ హాకింగ్ ఫౌండేషన్‌కు వెళ్తాయి. -
దేవుడు లేడన్నందుకు ఏడాది జైలు
'దేవుడు లేడు. బైబిల్ కథలన్నీ పుక్కిటి పురాణాలే' అని రష్యాకు చెందిన హేతువాది 38 ఏళ్ల విక్టర్ క్రష్ణోవ్ వ్యాఖ్యానించినందుకు ఆయనకు ఏడాది జైలుశిక్ష పడనుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కూడా కావు. 2014లో యూరోపియన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'వీకే డాట్ కామ్'లో చేసినవి. కేసవుతుందని తెలసి వెంటనే ఆ వ్యాఖ్యలను సైట్ నుంచి వెంటనే తొలగించారు కూడా. 2014లోనే కేసు దాఖలైనా, సోమవారం నుంచే విచారణ కొనసాగుతోంది. విక్టర్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసకుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనపై కేసు దాఖలైంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను రష్యా ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేది కాదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకర కథనాలపై కేసులు దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్నారు. దేవుడు లేడన్న విషయం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పినా.. తనపై కేసు దాఖలు చేయడం ఏంటని విక్టర్ ప్రశ్నిస్తున్నారు. అయినా సోషల్ మీడియా తన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం ఏంటని ఆయన అన్నారు. వాస్తవానికి సోషల్ మీడియా గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి కేసులు పెడుతోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. విక్టర్‌కు ఏడాది జైలుశిక్ష తప్పదని.. ఒకటి, రెండు రోజుల్లో తీర్పు వెలువడుతుందని న్యాయవర్గాలు తెలియజేస్తున్నాయి.