సిడ్నీలో ‘ఉగ్ర’టెన్షన్!


* కఫేలో పలువురిని బందీలుగా పట్టుకున్న సాయుధుడు

* కమెండో ఆపరేషన్‌తో వారిని విడిపించిన పోలీసులు

* సురక్షితంగా బయటపడిన వారిలో తెలుగువాడు

* పోలీసుల ఆపరేషన్‌లో ఇద్దరు
మృతి!.. ఆస్ట్రేలియాలో హైఅలర్ట్

 

 సిడ్నీ: సిడ్నీలో సోమవారం ఉదయం 9.30 గంటలు.. నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రం మార్టిన్‌ప్లేస్.. అక్కడి లింట్ చాక్లెట్ కఫేలోకి షాట్‌గన్,  మందుగుండు సామగ్రితో ప్రవేశించిన దుండగుడు.. కఫే ద్వారాలు మూసేసి తుపాకీతో బెదిరించి అందులోని దాదాపు 15 మందిని నిర్బంధించాడు. వారిలో తెలుగువాడైన ఇన్ఫోసిస్ ఉద్యోగి అంకిరెడ్డి విశ్వకాంత్‌రెడ్డి, మరో భారతీయుడు పుష్పేందుఘోష్ ఉన్నారు.

 

 మంగళవారం తెల్లవారుజాము 2.30 (సిడ్నీ కాలమానం)..

 ఉగ్రవాద ఘటనలపై స్పందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన టాస్క్‌ఫోర్స్ కమెండోలు పూర్తి రక్షణతో అత్యాధునిక ఆయుధాలతో ఆ కఫేలోకి దూసుకెళ్లారు. కాసేపు భారీ శబ్దాలు, తుపాకీ కాల్పుల ధ్వనులు.. అనంతరం బందీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన కమెండోలు. అయితే, పోలీస్ ఆపరేషన్ కన్నా ముందే విశ్వకాంత్ తప్పించుకోవడం కొసమెరుపు. 17 గంటలకు పైగా బందీలు, వారి బంధువులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. అయితే పోలీసులు నిర్ధారించలేదు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని మాత్రం ప్రకటించారు. విశ్వకాంతతో పాటు బందీగా ఉన్న మరో భారతీయుడు పుష్పేందు కూడా సురక్షితంగా బయటపడ్డాడు.  ఈ దుశ్చర్యకు పాల్పడింది ఇరాన్ దేశస్తుడైన, తనకు తాను ముస్లిం మతపెద్దగా ప్రకటించుకున్న హరోన్ మోనిస్(50) అని తెలుస్తోంది. ఆయన 1996లో శరణార్థిగాఆస్ట్రేలియా వచ్చాడు. తన మాజీ భార్యను దారుణంగా హత్య చేశాడని గత సంవత్సరం.. ఒక మహిళను లైంగికంగా వేధించాడని  ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

 

 అఫ్గానిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన ఆస్ట్రేలియా సైనికులను హంతకులని దూషిస్తూ వారి కుటుంబాలకు లేఖలు రాసేవాడు. తాను ఆధ్యాత్మిక సూచనలిస్తానని పత్రికల్లో ప్రకటనలిచ్చేవాడు.  ఈ దుశ్చర్యకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అన్న వార్తలు వచ్చాయి కానీ వాటిని ఎవరూ నిర్ధారించలేదు. అయితే, ఇస్లామిక్ స్టేట్ జెండాను కఫేలోకి పంపించాలని, ఆస్ట్రేలియా ప్రధాని అబ్బాట్‌తో మాట్లాడించాలని హరోన్ డిమాండ్ చేశాడని సమాచారం. హరోన్ మోనిస్‌ను ప్రాణాలతో పట్టుకున్నారా? లేక ఎదురుకాల్పుల్లో మరణించాడా? అనే విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడంలేదు. హరోన్‌తో పాటు ఒక బందీ చనిపోయాడని, ముగ్గురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సిడ్నీ సహా ఆస్ట్రేలియా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆ కఫేలోని అద్దాల కిటీకీల గుండా చేతులు పెకైత్తి నిలుచున్న కొందరు బందీలు, అరబిక్ భాషలో ప్రార్థనాగీతం రాసి ఉన్న నలుపురంగు జెండా కనిపించాయని ఓ చానల్ పేర్కొంది. ఉగ్రవాద ఘటనల సమయంలో స్పందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన టాస్క్‌ఫోర్స్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ కఫే ఉన్న భవనంలో ఎస్‌బీఐ,  బరోడా బ్యాంకుల శాఖలు కూడా ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆ కఫేకు కేవలం 300-400 మీటర్ల దూరంలో ఉన్న భారతీయ కాన్సులేట్ ఉద్యోగులను పంపించేశారు.  కాగా,  సిడ్నీలో మా ప్రతాపం చూశారుగా తర్వాత లక్ష్యం బెంగళూరే అంటూ ఇస్లామిక్ స్టేట్ మీడియా పేరుతో ఉన్న ట్వీటర్ అకౌంట్ ద్వారా బెంగళూరు పోలీసులకు  బెదిరింపులు వచ్చాయి.  

 

 గుంటూరువాసి సురక్షితం

 సాక్షి, గుంటూరు/హైదరాబాద్: సిడ్నీ ఘటనలో బందీగా ఉన్న తెలుగువాడైన విశ్వకాంత్‌రెడ్డి అంకిరెడ్డి సురక్షితంగా బయటపడటంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన విశ్వకాంత్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఏడేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. విశ్వకాంత్ ఈ ఘటనలో చిక్కుకుపోవడంతో భయాందోళనలకు గురైన ఆయన తండ్రి ఈశ్వర్‌రెడ్డి.. కుమారుడి క్షేమ సమాచారం విని  ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 10 గంటలకు ఆఫీస్‌కు బయల్దేరిన తన కుమారుడు మార్గమధ్యంలో కఫేకు వెళ్లాడని, అక్కడే తన కుమారుడితో పాటు మరో 29 మందిని దుండగుడు నిర్బంధంలోకి తీసుకున్నాడని ఆయన వివరించారు. బందీలకు ఎలాంటి హానీ చేయలేదని, ఆహారం కూడా ఇచ్చారని తెలిసిందన్నారు. బిట్స్ పిలానీలో చదువు పూర్తి చేసిన విశ్వకాంత్ మొదట యూఎస్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం రావడంతో ఆస్ట్రేలియా వెళ్లారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top