అలా అరిచినందుకే.. శిక్షపడింది..!


లండన్ః పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ వ్యక్తి ''అల్లాహ్ -ఒ-అక్బర్'', ''బూమ్'' అంటూ విమానంలో అరవడం,  ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేయడంతో అతడికి పది వారాల జైలు శిక్ష పడింది. అతడు వాడిన పదాలు తప్పు కాకపోయినప్పటికీ విమానంలో అలా ప్రవర్తించడాన్ని కోర్టు తప్పుబట్టింది.  



షెహరాజ్ సర్వార్ అనే వ్యక్తి విమానంలో అల్లకల్లోలం సృష్టించడంతో అతడికి లండన్ కోర్టు ఏడు వారాల జైలు శిక్ష విధించింది. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ వెడుతున్న ఎమిరేట్స్ బోయింగ్  777  విమానంలో ప్రయాణించినప్పుడు అతడు చేసిన హడావుడికి ప్రయాణీకులను హడలి పోయేలా చేసింది. కాసేపు ఏం జరుగుతోందో తెలియక అంతా ఖిన్నులైపోయారు. అల్లాహ్-ఒ-అక్బర్ అంటూ  అతి పెద్ద గొంతుతో, భీకరంగా పదే పదే అరుస్తూ ప్రయాణీకుల గుండెల్లో విమానాలు పరిగెత్తిచాడు. చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడ  'బూమ్' అంటూ గట్టిగా అరిచి అందర్నీ భయపెట్టినట్లు బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ తెలిపారు. క్యాబిన్ సిబ్బంది కూర్చోమని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి  అరుస్తూనే ఉండటంతో  కొందరు ప్రయాణీకులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అనంతరం అతడ్ని అరెస్టు చేసినట్లు అలెక్స్ వారెన్ కోర్టుకు తెలిపారు. సర్వార్ హింసాత్మక ప్రవర్తనపై ప్రయాణీకులనుంచి వెల్లువెత్తిన నేరారోపణలను ఆయన కోర్టుకు వివరించారు.



ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి ఫ్రాన్సిస్ లయర్డ్ .. విమానంలో 38 ఏళ్ళ సర్వార్ విపరీత ధోరణితో ప్రవర్థించినట్లుగా నిర్ధారించారు. శిక్షించకుండా వదిలేస్తే మరోసారి విమానాల్లో ప్రయాణీకులను భయపెట్టే ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండటంతో నిందితుడు సర్వార్ కు  10 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్ష ముగిసిన తర్వాత 12 నెలల పర్యవేక్షణ ఆర్డర్ తో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వార్.. పాకిస్తాన్ లోని తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటువంటి ఘటన జరిగిందని, అతడు కలత చెంది ఉండటంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వాదించిన నిందితుడి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ సైతం తన క్లైంట్ ప్రవర్తన అవివేకంతోనే జరిగిందని ఒప్పుకున్నారు. ప్రయాణీకులను భయపెట్టే విధంగా అల్లాహ్-ఒ-అగ్బర్ అంటూ అరవడం మూర్ఖత్వమే అయినప్పటికీ, దేవుడా నీవు ఎంతో గొప్పవాడవు అంటూ ప్రార్థించడమేనని, అతడి చర్యలు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినందుకు క్షమించమంటూ సింగ్ కోర్టుకు విన్నవించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top