‘సాహసాన్ని’ చంపేశారు.. | Sakshi
Sakshi News home page

‘సాహసాన్ని’ చంపేశారు..

Published Wed, Feb 15 2017 11:18 PM

‘సాహసాన్ని’ చంపేశారు..

ప్రాణం అంటే అతనికి లెక్కలేదు. పోరాటం అంటే వెనక్కి తిరిగే అలవాటూ లేదు. సామ్రాజ్య వాదానికి వెన్ను చూపించే తత్వం అంత కన్నా కాదు. విప్లవానికే ఓ కొత్త పాఠంగా నిలిచాడు. యుద్ధానికి భయం నేర్పాడు. అతడే ప్రపంచ విప్లవకారుడు చే గువేరా. కాని సామ్రాజ్యావాదాన్ని గడగడలాడించిన ‘చే’ ఎక్కువ రోజులు బతకలేకపోయాడు. అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారిన చే గువేరా మరణం వెనుక అనేక కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయి. ప్రజానేతగా ఎదిగి ప్రభుత్వాలకు ముచ్చెటములు పట్టించిన చే గువేరా మరణం గురించి నేటి ‘బిలీవ్‌’ లో తెలుసుకుందాం!       

అది 1967 అక్టోబర్‌ 9.. వల్లెగ్రాండె, బొలీవియా. సామ్రాజ్య వాద వికృత రూపం విరుచుకుపడింది. పోరాటానికే పాఠాలు నేర్పిన వీరుడి చరిత్ర కాల గర్భంలో కలిసిపోయింది. ప్రపంచమంతా స్వేచ్చా వాయువులు పీల్చాలని కోరుకున్న గొంతు మూగబోయింది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో విప్లవ వీరుడు చే గువేరా చనిపోయినట్లు బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది. కాని నిర్జీవంగా పడి ఉన్న చే గువేరా దగ్గరకు రావడానికి కూడా ఏ ఒక్క సైనికుడు ధైర్యం చేయలేదు.

ఎవరీ ‘ చే ’..
చే గువేరా 1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రోసారియోలోని ఓ ఉన్నత కుటుంబంలో జన్మించాడు. చిన్న నాటి నుంచే విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. అందులోనూ సాహసగాధలంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇంజిన్‌ అమర్చిన సైకిల్‌ మీద అర్జెంటీనా అంతా ప్రయాణం చేసి ప్రజల జీవన విధానాలను మనసుతో చూశాడు. ప్రజలు పడుతున్న బాధలను శాశ్వతంగా రూపుమాపాలని వైద్య విద్యను చదివాడు. అనారోగ్యంతో బాధపడేవారి జీవితాల్లో వెలుగునింపాలని ఆలోచించేవాడు. చివరగా డాక్టర్‌ డిగ్రీ చేతికి రాగానే ప్రజలకు సేవ చేస్తూ మళ్లీ దేశమంతటా యాత్ర చేశాడు. అక్కడి నుంచి లాటిన్‌ అమెరికా వెళ్లాడు.  

గెరిల్లా నాయకుడిగా..!
లాటిన్‌ అమెరికాలోనూ ప్రజల దుర్భర జీవితాలను గమనించిన చే వారి బతుకులు మార్చడంకోసం ఏ వైద్యం చేయగలం, ఏ మెడిసిన్‌ ఇవ్వగలం అంటూ మదనపడుతున్న సమయంలోనే 1955 మెక్సికోలో క్యూబా ప్రవాస విప్లవకారుడు ఫీడల్‌ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. క్యూబా విప్లవంలో డాక్టర్‌గా చేరాడు. అనంతరం దోపిడీకి గురవుతున్న ప్రజలకు విప్లవాత్మక మెడిసిన్‌ అవసరమని భావించి విప్లవకారుడిగా పరిణితి చెంది విప్లవ గెరిల్లా దళానికి నాయకుడయ్యాడు. క్యూబా స్వాతంత్య్రం కోసం అస్తమా వ్యాధిని సైతం లెక్కచేయకుండా చే నిజమైన గెరిల్లా నాయకుడయ్యాడు.

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా..!
1959లో క్యూబా స్వాతంత్య్రం రావడంతో అక్కడి ప్రభుత్వంలో చే గువేరా పరిశ్రమల మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడి వంటి ఎన్నో బాధ్యతలను నిర్వహించాడు. క్యూబా ఒక్క దేశాన్ని విముక్తి చేసినంత మాత్రానా సామ్రాజ్యవాదం అంతరించిపోయిందనుకోవడం సరైంది కాదని అన్ని దేశాలను దీని నుంచి విముక్తి కలిగించాలనుకున్నాడు. వెంటనే అక్కడ తనకున్న అన్ని పదువులను వదిలేసి తను అత్యంత ఇష్టపడే స్నేహితుడు కాస్ట్రో, క్యూబా ప్రజలకూ వీడ్కోలు పలికి ప్రపంచ దేశాలను తిరగడం మొదటుపెట్టాడు. అనంతరం కమ్యూనిస్టు గెరిల్లా్ల దళాన్ని స్వయంగా తయారు చేసుకుని విప్లవోద్యమాన్ని నిర్మించి నాయకత్వం వహించాడు.

కాంగో ప్రజలకు బాసటగా..!
ఆఫ్రికా చీకటి ఖండంగా మారడానకి కారణం..సామ్రాజ్యవాద శక్తులే కారణమని భావించిన చే కాంగో వెళ్లి పోరాటం మొదలుపెట్టాడు. కాని ఇక్కడ చే వేసే ప్రతి అడుగును అమెరికా పసిగట్టింది. ఎలాగైనా చే ను ఆపకుంటే ప్రపంచాన్నంత విప్లవబాటలోకి తీసుకెళ్తాడని భావించింది. ఈ సమయంలోనే కాంగో తిరుగుబాటుదారుల నుంచి చే కు అనుకున్నంత మద్దతు లభించలేదు. కాంగో నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్యూబా వెళ్లాలనుకున్నా అక్కడ క్యాస్ట్రో అప్పటికే  చే పై చెడు ప్రచారం ప్రారంభించాడు. దీంతో అక్కడి నుంచి బొలీవియా చేరుకుని అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు.

రహస్య ఆర్మీతో..!
తన విప్లవ మేధస్సుతో 50 మంది గెరిల్లాలతో 1800 మంది కలిగిన బొలీవియా నియంత సైన్యాలను గడగడలాడించాడు. అమెరికా ప్రభుత్వ సామ్రాజ్యవాద శక్తులతో ప్రజలను ఎలా హింసిస్తుందో వివరించే ప్రయత్నం చేశాడు. కాని ముందుగానే పసిగట్టిన అమెరికా బొలీవియన్‌ ఆర్మీలో రహస్యంగా.. చే ను చంపేందుకు ఓ వింగ్‌ను ఏర్పాటు చేసింది. చే బతికి ఉంటే తమ ప్రయోజనాలను దెబ్బ తీస్తాడని ఎలాగైనా చే ను అంతమొందించాలని ఆర్మీకీ సంకేతాలు పంపింది. 1967 అక్టోబర్‌ 7న తిరుగుబాటు దారులతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని ఓ రహస్య సమావేశాన్ని చే నిర్వహించాడు. ఈ సమావేశాన్ని ముందుగానే గమనించిన ఆర్మీ అక్కడికి చేరుకుంది. చే ను టార్గెట్‌ చేస్తూ కాల్పులు ప్రారంభించింది.


మోకాళ్లకు తగిలిన బుల్లెట్లతో చే ముందుకు నడవలేకపోయాడు. విల్లీ అనే గెరిల్లా చే ను భుజాలపై ఎత్తుకొని పరిగెత్తుతుండగా ఆర్మీ చుట్టుముట్టి వారిని ప్రాణాలతో పట్టుకుని రహస్య ప్రదేశానికి పంపింది. కాని అమెరికా ప్రభుత్వం చే ను చంపకుంటే విప్లవం పెరిగిపోతుందని బొలీవియా సహా పలు దేశాలను సంకేతాలు పంపింది. దీంతో బొలీవియన్‌ ప్రెసిడెంట్‌ రెయిన్‌ బారియంట్‌.. చే ను చంపాలని ఆర్మీనీ ఆదేశించాడు. దీంతో రహస్య ప్రదేశంలో ఉన్న చే, విల్లీల దగ్గరకు ఓ సైనికుడు కాల్పులు జరిపేందుకు వచ్చాడు. కాని చే ను చూడగానే గడగడ వణికిపోయాడు. నన్ను చంపు అంటూ చే గర్జిండంతో భయపడిన..సైనికుడు వెంటనే తన వద్ద ఉన్న రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అంతే ఒక్కసారిగా చే విప్లవం విజయం సాధిస్తుందని నినాదం చేస్తూ ప్రాణాలు విడిచాడు.  అంతే ఇక ఆ విప్లవ యోధుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది.  
–సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement