జెరూసలెం చర్చికి ముస్లిం కేర్‌టేకర్‌ | muslim family takes care of holy sepulchre church of jerusalem | Sakshi
Sakshi News home page

జెరూసలెం చర్చికి ముస్లిం కేర్‌టేకర్‌

Apr 13 2017 3:44 PM | Updated on Oct 19 2018 6:51 PM

జెరూసలెం చర్చికి ముస్లిం కేర్‌టేకర్‌ - Sakshi

జెరూసలెం చర్చికి ముస్లిం కేర్‌టేకర్‌

జెరూసలెంలోని ‘హోలీ సెపల్కర్‌’ చర్చి సంరక్షణా బాధ్యతలను 500 సంవత్సరాలకు పైగా ఓ ముస్లిం కుటుంబం చూస్తోంది.

జెరూసలెంలోని ‘హోలీ సెపల్కర్‌’ చర్చి ప్రపంచంలోని క్రైస్తవులందరికీ ఎంతో పవిత్రమైన స్థలమన్నది తెల్సిందే. ఎందుకంటే ఏసుక్రీస్తు సమాధి ఈ చర్చిలోనే భద్రపర్చారన్నది క్రైస్తవుల విశ్వాసం. ఇటీవల సమాధి ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని కూడా పునరుద్ధరించారు. అయితే పునరుద్ధరణ పనుల సందర్భంగా ప్రజలను లోపలి వరకు అనుమతించలేదు.

స్థానికులకు తెలుసేమో గానీ ఈ చర్చికున్న మరో విశేషం ఇప్పుడు ప్రపంచం దృష్టికి వచ్చింది. తరతరాలుగా, అంటే 500 సంవత్సరాలకుపైగా ఈ చర్చి సంరక్షణా బాధ్యతలను ఓ ముస్లిం కుటుంబం చూస్తోంది. చర్చికున్న ప్రధాన ద్వారం తాళం చెవి ఈ ముస్లిం కుటుంబం వద్దనే ఉంటోంది. ఆ కుటుంబంలోని 80వ తరానికి చెందిన అదీబ్‌ జౌదే వద్ద ఇప్పుడు తాళం చెవి ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వెళ్లి చర్చి తలుపులు తెరిచి రావాలి. అలాగే మూసి రావాలి. తాళం చెవి ఇంట్లో మరచిపోయి చర్చికి రావడం లాంటి సందర్బాలు కూడా లేవట. చారిత్రక, మత పవిత్ర స్థలాలపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసే ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌’ ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ ద్వారా ఈ విశేషాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది.

అప్పట్లో చర్చి నిర్వాహకుల్లో ఆర్మేనియన్, గ్రీక్, ఫ్రాన్సిస్కాన్‌ క్రైస్తవులు ఉండేవారట. చర్చి కేర్‌టేకర్‌ తటస్థ వ్యక్తి అయి ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ప్రజాభిమానం కలిగిన ఓ ముస్లిం పెద్దకు ఆ బాధ్యతలు అప్పగించారట. అప్పటి నుంచి చర్చి ప్రధాన ద్వారం తాళం చెవి ఆ ముస్లిం కుటుంబం వద్దనే ఉంటూ వస్తోంది. ఈ బాధ్యతను నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణమని, ప్రపంచంలోని ముస్లింలందరికీ కూడా ఇది గౌరవ చిహ్నమని ప్రస్తుత కేర్‌ టేకర్‌ అదీబ్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement