ట్రంప్‌ను చంపినవారికి రూ.570 కోట్లు..!

Iran State TV Offers 80 Million Dollars Reward To Kill Donald Trump - Sakshi

టెహ్రాన్‌ : ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సోలెమన్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశం మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్‌ అధికారిక ఛానెల్‌ ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హతమార్చిన వారు 80 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.570 కోట్లు) గెలుచుకోవచ్చని తెలిపింది. దేశంలోని ప్రతి పౌరుడు తలా ఒక డాలర్‌ చొప్పున పోగుచేసి ఆ మొత్తాన్ని ట్రంప్‌ ప్రాణాలు తీసిన వారికి రివార్డుగా ఇస్తామని వెల్లడించింది. ‘ఇరాన్‌ జనాభా 8 కోట్లు. మా దేశ జనాభా ఆధారంగా ట్రంప్‌ తల నరికి తెచ్చివారికి రివార్డు ప్రకటించాం’అని సదరు టీవీ ఛానెల్‌ పేర్కొంది.
(చదవండి : నిశ్శబ్దంగా చంపేశారు)

కాగా, ఇరాక్‌లోని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ టాప్‌ సైనిక కమాండర్‌, ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌, ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ అబూ మహదీ అల్‌ ముహండిస్‌ మృతిచెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మృతితో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తాజా చర్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌ ఎలాంటి ప్రతీకార చర్యకు దిగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే, ఇరాన్‌ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ఆయన ట్వీట్‌ చేశారు.
(చదవండి : మా ప్రతీకారం భీకరం)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top