‘నగ్న సీన్ల కోసం నా పై ఒత్తిడి’

Hollywood Actress Emilia Clarke Says Pressured Me Into Nude Scenes - Sakshi

రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులకు సంబంధించి 2016లో బీబీసీ నెట్‌వర్క్‌ కోసం తీసిన ‘క్లోజ్‌ టు ది ఎనిమీ’ మినీ సిరీస్‌ షూటింగ్‌ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీఫెన్‌ పొలియాకాఫ్‌ తనపై నగ్న సీన్ల చిత్రీకరణ కోసం ఒత్తిడి చేశారని 34 ఏళ్ల ఎమిలియా క్లార్క్ ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకుండా సిరీస్‌ నుంచి తప్పుకున్నానని తాజా హాలీవుడ్‌ చిత్రం ‘హ్యూమన్‌’లో హీరోయిన్‌గా నటించిన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సిరీస్‌కు రచయిత, దర్శకుడు స్టీఫెన్‌ పొలియాకాఫే. ఆయనకిప్పుడు 67 ఏళ్లు.

‘క్లోజ్‌ టు ది ఎనిమీ’ సిరీస్‌ నుంచి తప్పుకున్న ఆమె ‘సన్స్‌ ఆఫ్‌ లిబర్టీ’లో నటించారు. అది  హిట్‌ కాకపోవడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. అయితే ఎమిలియా చేసిన ఆరోపణలను ‘బాఫ్టా’ అవార్డు గ్రహీత స్టీఫెన్‌ ఖండించారు. ఆమె ప్రస్తుతం ఉన్న స్థితికి చింతిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.‘నగ్న సీన్ల కోసం ఎంతసేపు బట్టలు లేకుండా ఉండాలి. ఏ పార్టులో బట్టలు లేకుండా ఉండాలి. నాపై లైట్‌ ఫోకస్‌ ఎలా ఉంటుంది?’ అని తానడగడంతో దర్శకుడికి కోపం వచ్చిందని, తాను ఏది ఎలా తీయదల్చుకుంటే అలాగే తీస్తానంటూ గొడవ చేశారని ‘ది గార్డియన్‌’ పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు. 

ఈ విషయమై పత్రిక స్టీఫెన్‌ వివరణ కోరగా ‘ఎమిలియా క్లార్క్ ప్రస్తుతమున్న స్థితికి నేను చింతిస్తున్నాను. ఆ రోజులో ఏం జరిగిందనేది వరుసగా నేను గుర్తు చేయదల్చుకోలేదు. వాస్తవానికి సినిమా షూటింగ్‌కు ముందే ఆమె పాత్ర గురించి మా మధ్య చర్చకు వచ్చింది. మగ వాళ్లయినా, ఆడవాళ్లయినా నగ్నంగా నటించాలంటే ఎంత బాధ పడతారో, ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. వారిని అలా నేను బాధ పెట్టను. నాది సున్నితమైన మనసు’ అని ఆయన వివరణ ఇచ్చారు. ‘మీటూ’ ఉద్యమం కింద ఎంతోమంది హాలీవుడ్‌ తారలు దర్శక, నిర్మాతలపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సెక్స్‌ సీన్లలో నటించడం ఇష్టం లేక తాను కూడా ఓ సినిమా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు గత డిసెంబర్‌ నెలలో బ్రిటీష్‌ తార రుత్‌ విల్సన్‌ ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top