హిందూ డాక్టర్ని కాల్చి చంపారు! | Hindu doctor fatally shot dead in Pakistan's Karachi | Sakshi
Sakshi News home page

హిందూ డాక్టర్ని కాల్చి చంపారు!

Aug 6 2016 4:38 PM | Updated on Mar 23 2019 8:28 PM

హిందూ డాక్టర్ని కాల్చి చంపారు! - Sakshi

హిందూ డాక్టర్ని కాల్చి చంపారు!

పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో ఓ హిందూ డాక్టర్ని క్లినిక్ బయటే గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

కరాచీః పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో 56 ఏళ్ళ హిందూ డాక్టర్ని ఆయన క్లినిక్ బయటే గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గార్డెన్ ఈస్ట్ నివాసి డాక్టర్ పిరీతమ్ లఖ్వానీ గురువారం క్లినిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాక్ కాలనీలోని బారారోడో సమీపంలో దుండగులు అతని ఛాతీలో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయాలైన లఖ్వానీని అబ్బాసీ షహీద్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడినుంచీ అగాఖాన్ యూనివర్శిటీ ఆస్పత్రికి షిఫ్ట్ చేసినా లాభం లేకపోయింది.

క్లినిక్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న లఖ్వానీపై దుండగులు దాడిచేసి, హత్య చేశారని ఆయన కుమారుడు రాకేష్ కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులెవరో తన తండ్రి సెల్ ఫోన్ నుంచీ కాల్ చేసి, ఆయన హత్యకు గురైనట్లు తెలిపారని కుమార్ వివరించాడు. లఖ్వానీకి  ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదని,  ఇంతకు ముందెన్నడూ ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదని రాకేష్ చెప్తున్నాడు. కాగా లఖ్వానీ గత 15 సంవత్సరాలుగా అదే కాలనీలో  క్లినిక్ నడుపుతున్నారని, హత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్తున్నారు. క్లినిక్  నివాస ప్రాంతంలోనే ఉన్నప్పటికీ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో దుండగులను ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు అంటున్నారు. అసలు హత్యకు ఒక్కరే ప్రయత్నించారా, ఎక్కువ మంది ఉన్నారా అన్న విషయాలతోపాటు.. హత్యవెనుక కారణాలు ఇంకా తెలియ రాలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే లఖ్వానీని చంపాలన్నదే టార్గెట్ గా పెట్టుకొని ఈ హత్య జరిగినట్లుగా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి మహ్మద్ హుస్సేన్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే..  లఖ్వానీది మతపరమైన హత్య అయి ఉండొచ్చని ముత్తహిదా ఖ్వామీ ఉద్యమ నేత సంజయ్ పెర్వానీ అభివర్ణించారు. డాక్టర్ లఖ్వానీ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ వేయించమని అసిస్టెంట్ ను బయటకు పంపిన సమయంలో బహుశా ఈ హత్య జరిగి ఉండొచ్చని, మరో రకమైన ఆధారాలేవీ కనిపించడంలేదని పెర్వానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతవారం 32 ఏళ్ళ హిందూ డాక్టర్ అనిల్ కుమార్ కూడా కరాచీ ఆస్పత్రి ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని, అంతకు ముందు  హిందూ మతానికి చెందిన ఇద్దరిని అబ్బాస్ టౌన్ లోని వైన్ షాప్ వద్ద దాడి చేసి కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుందని అంటున్న పెర్వానీ.. లఖ్వానీది కూడా అటువంటి మతపరమైన హత్యే అయిఉండొచ్చంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement