హ్యాపీ బర్త్‌ డే గూగుల్‌ | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌ డే గూగుల్‌

Published Wed, Sep 27 2017 1:16 PM

 Google celebrates 19th birthday with Surprise Spinner Doodle

సాక్షి, హైదరాబాద్‌: కోటానుకోట్ల సెర్చ్ పేజీలు.. లెక్క‌కు మించిన అప్లికేష‌న్లు.. వంద‌ల కోట్ల సంఖ్య‌లో వినియోగ‌దారులు... ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ట‌ర్నోవ‌ర్‌...ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ గురించి చాలానే ఉంది. 1998 లో లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ లు స్థాపించిన గూగుల్ నేడు సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఆ కంపెనీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గూగుల్ గురించి ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈ రోజు ఆ సంస్థ బ‌ర్త్ డే మ‌రి..! 

లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్ ల‌లో ఎవ‌రూ కూడా తాము గూగుల్‌ను స్థాపించిన తేదీని గుర్తు పెట్టుకోలేదు. ఫ‌లితంగా దాని వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని మొద‌ట్లో సెప్టెంబ‌ర్ 26, సెప్టెంబ‌ర్ 7, సెప్టెంబ‌ర్ 8 తేదీల్లో జరిపేవారు. ఇక గూగుల్‌కు చెందిన వికీ పేజ్‌లో చూస్తే దాని వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సెప్టెంబ‌ర్ 4, 1998 అని ఉంటుంది. ఈ క్ర‌మంలో ఒక నిర్దిష్ట తేదీ నాడే గూగుల్ బ‌ర్త్ డే జ‌ర‌పాల‌ని ఆ కంపెనీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. దీంతో 2006 నుంచి సెప్టెంబ‌ర్ 27వ తేదీన గూగుల్ బ‌ర్త్ డేను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. 

కాగా గూగుల్‌ 19వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. ప్రముఖుల పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో నూతన డూడుల్స్‌ ఏర్పాటు చేసే గూగుల్‌ తన 19వ పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త డూడుల్‌ రూపొందించింది. బర్త్‌డే కేక్‌, బెలూన్స్‌, గిఫ్ట్స్‌తో డూడుల్‌ సిద్ధం చేయడంతో పాటు సర్‌ప్రైజ్‌ స్పిన్నర్‌ను ఏర్పాటు చేసింది. స్పిన్నర్‌ ను క్లిక్‌ చేస్తే 19 రకాల డూడుల్‌ గేమ్స్‌ దర్శనమిస్తాయి.

Advertisement
Advertisement