రొసెట్టా అంతరిక్ష నౌక తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించింది.
వాషింగ్టన్: రొసెట్టా అంతరిక్ష నౌక తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించింది. 12 ఏళ్ల పాటు విజయవంతంగా ఖగోళ శాస్త్రవేత్తలకు సేవలందించిన ఈ నౌక, ప్రణాళిక ప్రకారం 67పీ/చుర్యుమోవ్–గెరాసిమెంకో తోక చుక్కను ఢీకొని అందులో లీనమైపోయింది. ఢీ కొనే ముందు నౌక తోక చుక్క ఫొటోలను చివరిసారిగా శుక్రవారం తీసింది. దీని నుంచి సమాచారం భూమిపైకి రావడం కష్టమవడంతో శాస్త్రవేత్తలు నౌక సేవలను విరమింప జేయాలనుకుని ఈ పనిచేశారు.
ఆ తోకచుక్కపై ఉన్న వాయువులు, దుమ్ము, ప్లాస్మా వాతావరణాన్ని అతి దగ్గరి నుంచి అధ్యయనం చేసేందుకు యురోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్‌ఏ) ఈ నౌకను 2004లో ప్రయోగించింది. 2014 ఆగస్టు 6న తోకచుక్కను చేరింది. తోక చుక్క ఉపరితలానికి చేరిన తొలి నౌకగా రికార్డు సృష్టించింది. రొసెట్టాను తీసుకొచ్చిన వాహనంలోనే అమర్చిన ఫిలే అనేlమరో చిన్న నౌక 2014 నవంబర్ 4న తోకచుక్క మీద పడి అనేక సార్లు ఎగిరిన తర్వాత దాని ఉపరితలపై స్థిరపడింది.
తోకచుక్క ఉపరితలంపై నుంచి తొలిసారి తీసిన ఫొటోలను, ఇతర విలువైన సమాచారాన్ని ఫిలే కిందకు పంపింది. చాలా రోజుల పాటు అక్కడి పరిస్థితులపై ఫొటోలను తీసి కిందకి పంపించింది. సూర్యుడి రేడియేషన్ తీవ్రమైతే తోకచుక్కలు ఎలా మారుతాయో దగ్గర నుంచి పరిశీలించిన తొలి నౌక రొసెట్టా.