breaking news
Rosetta
-
చివరి ఫొటో పంపిన రొసెట్టా వ్యోమనౌక
వాషింగ్టన్: రొసెట్టా అంతరిక్ష నౌక తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించింది. 12 ఏళ్ల పాటు విజయవంతంగా ఖగోళ శాస్త్రవేత్తలకు సేవలందించిన ఈ నౌక, ప్రణాళిక ప్రకారం 67పీ/చుర్యుమోవ్–గెరాసిమెంకో తోక చుక్కను ఢీకొని అందులో లీనమైపోయింది. ఢీ కొనే ముందు నౌక తోక చుక్క ఫొటోలను చివరిసారిగా శుక్రవారం తీసింది. దీని నుంచి సమాచారం భూమిపైకి రావడం కష్టమవడంతో శాస్త్రవేత్తలు నౌక సేవలను విరమింప జేయాలనుకుని ఈ పనిచేశారు. ఆ తోకచుక్కపై ఉన్న వాయువులు, దుమ్ము, ప్లాస్మా వాతావరణాన్ని అతి దగ్గరి నుంచి అధ్యయనం చేసేందుకు యురోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) ఈ నౌకను 2004లో ప్రయోగించింది. 2014 ఆగస్టు 6న తోకచుక్కను చేరింది. తోక చుక్క ఉపరితలానికి చేరిన తొలి నౌకగా రికార్డు సృష్టించింది. రొసెట్టాను తీసుకొచ్చిన వాహనంలోనే అమర్చిన ఫిలే అనేlమరో చిన్న నౌక 2014 నవంబర్ 4న తోకచుక్క మీద పడి అనేక సార్లు ఎగిరిన తర్వాత దాని ఉపరితలపై స్థిరపడింది. తోకచుక్క ఉపరితలంపై నుంచి తొలిసారి తీసిన ఫొటోలను, ఇతర విలువైన సమాచారాన్ని ఫిలే కిందకు పంపింది. చాలా రోజుల పాటు అక్కడి పరిస్థితులపై ఫొటోలను తీసి కిందకి పంపించింది. సూర్యుడి రేడియేషన్ తీవ్రమైతే తోకచుక్కలు ఎలా మారుతాయో దగ్గర నుంచి పరిశీలించిన తొలి నౌక రొసెట్టా. -
తోక చుక్కపై తొలితొడుగు
రోసెట్టా వ్యోమనౌక సాయంతో ఫీలేల్యాండర్ '67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో' తోకచుక్కపై దిగటం..ఖగోళ చరిత్రలోనే అద్భుతఘట్టం. అంతరిక్షం నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా మానవాళి వేసిన తొలి అడుగు ఈ విజయం. ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ(ఈసా) ఈ అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. 67పీ తోకచుక్క ఆగస్టు 13న సూర్యుడికి అత్యంత సమీపానికి(186 మిలియన్ కిలోమీటర్లు) వెళ్లింది. ఆ సమయంలో ఆ తోకచుక్క ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, స్పందనలను చిత్రాల రూపంలో రోసెట్టా ఇటీవల భూమిపైకి పంపింది. ఈ నేపథ్యంలో 67పీ తోకచుక్కపై ఫీలే ల్యాండింగ్ ప్రయోగ విశేషాలు తెలుసుకుందాం. ఎవరు ప్రయోగించారు? ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘67 పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కపైకి రోసెట్టా వ్యోమనౌకను 2004లోప్రయోగించింది. ఇది పదేళ్లపాటు సుమారు 640 కోట్ల కిలోమీటర్లు అంతరిక్షంలో ప్రయాణించి గతేడాది నవంబర్ 12న ఆ తోకచుక్కను చేరింది. వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఆ తోకచుక్క చుట్టూ తిరుగుతూనే ఫీలే ల్యాండర్‌ను రోసెట్టా ఆ తోకచుక్కపైకి జారవిడించింది. ఇలా ఒక తోకచుక్కపై వ్యోమనౌకను దింపటం ఇదే తొలిసారి. ఎందుకు ప్రయోగించారు? సౌరకుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన పురాతన పదార్థంతో 450 కోట్ల ఏళ్ల క్రితం ఈ తోకచుక్క ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దానిపై అధ్యయనం చేస్తే..భూమిపై నీరు ఎలా వచ్చింది? జీవం ఎలా ఏర్పడింది? గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? వంటి విషయాలు తెలుసుకోవచ్చు. సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది. 67 పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో.. బొగ్గులాగా నల్లగా, రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది. 14 కి.మీ పరిమాణంలో ఉన్న ఈ తోకచుక్క సౌరకుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన పదార్థంతో ఏర్పడిందని శాస్త్రవ్తేతలు నమ్ముతున్నారు. ఈ తోకచుక్క సెకనుకు 18 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. తన చుట్టూ తాను తిరగడానికి12 గంటల సమయం తీసుకుంటుంది. సూర్యుడి చుట్టూ తిరగడానికి ఆరున్నారేళ్ల సమయం పడుతుంది. మూగబోయిన ల్యాండర్ తోకచుక్కపై దిగే సమయంలో ల్యాండర్ మూడు సార్లు ఎగిరి పడటంతో కదుపులకులోనై రాళ్ల మధ్య సూర్యరశ్శి సోకని చీకట్లో పడింది. దీంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక తాత్కాలికంగా మూగబోయింది. అయితే బ్యాటరీ పూర్తిగా అయిపోకముందు ఇది మూడురోజులపాటు తాను సేకరించిన సమాచారాన్ని రోసెట్టా వ్యోమనౌకకు చేరవేసింది. 67పీ తోకచుక్క చుట్టూ తిరుగుతున్న రోసెట్టా ద్వారా సంకేతాలను పంపుతూ ఫీలేని నిద్రలేపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఏడు నెలల తరువాత మేలుకొంది. ‘హలో ఎర్త్’అంటూ భూమిపైకి సంక్షిప్త సందేశాన్ని కూడా పంపింది. వంద కేజీల బరువు, రిఫ్రిజరేటర్ పరిమాణంలో ఉన్న ఫీలే ల్యాండర్ పది భిన్నమైన శాస్త్రపరికరాలతో ఆ తోకచుక్కపై పరిశోధనలు చేస్తోంది. ల్యాండర్‌కి అమర్చిన 7 కెమెరాలు.. 360 డిగ్రీల కోణంలో తోకచుక్క ఛాయాచిత్రాలను తీసి ఎప్పటికప్పుడు భూమిపైకి పంపుతూనే ఉంది. మరి కొన్ని విశేషాలు 67పీ తోకచుక్క 4 కి.మీ వెడల్పు, 5 కి.మీ పొడవు, 1000 టన్నుల బరువు ఉంటుంది. ప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో సెకనుకు 18 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఫిలే బరువు భూమిపై 100 కిలోలు. తోక చక్కపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ కనుక కిలో లోపే ఉంటుంది. రోసెట్టా జీవితకాలం 12 ఏళ్లు. రోసెట్టా వ్యోమనౌక గంటకు 54, 718 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఆ తోకచుక్కను చేరింది. రోసెట్టాకు కాంతి వేగంతో ఒక సందేశాన్ని పంపితే దాన్ని చేరటానికి 30 నిమిషాలు పడుతుంది. 1969లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు 67పీ తోకచుక్కను కనుగొన్నారు. ఆ ఇద్దరి పేర్లే ఈ తోకచుక్కకు పెట్టారు. -
తోకచుక్కపై స్థిరంగా ఫీలే ల్యాండర్
లండన్: తోకచుక్క‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’పై రోసెట్టా వ్యోమనౌక నుంచి జారవిడిచిన ఫీలే ల్యాండర్ స్థిరంగా ఉందని ఐరోపా అంతరిక్ష సంస్థ గురువారం వెల్లడించింది. ల్యాండర్ తొలుత ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తర్వాత స్థిరంగా పనిచేస్తోందని తెలిపింది. తోకచుక్క ఉపరితలంపై ల్యాండర్ కొక్కేలు మొదట సరిగ్గా దిగబడకపోవటంతో ల్యాండర్ కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిందని, చివరకు ఒక చోట అది తన కొక్కేలను తోకచుక్క ఉపరితలంపై దిగేలా చేసిందని పేర్కొంది. ల్యాండర్ తాను తీసిన చిత్రాలను పంపుతోందని, ఇది తోకచుక్కపై ఎక్కడ ఉందనే విషయంపై పరిశీలన జరుపుతున్నామంది.