వీధుల్లోనే కరోనా మృతదేహాలు

గ్వయాకిల్‌లోని ఓ వీధిలో రోడ్డుపక్కనే పడి ఉన్న మృతదేహం - Sakshi

క్విటో: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. భౌతిక దూరం పాటించడంలో అక్కడి ప్రజలు విఫలమవ్వడంతో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా మృతదేహాలను ఖననం చేయడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ఇళ్ల ఎదుటే శవాలను రోజుల తరబడి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక పట్టించుకునే వారులేని వారి మృతదేహాలను రోడ్లపైనే వదిలేసి వెళుతున్నారు. ఇదే సమయంలో సాధారణ మృతదేహాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల ఎదుట శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి అంత్యక్రియలు చేయడానికి వేచి చూసి చివరికి చేసేదేమిలేక సముద్రాలలో కూడా శవాలను పడేస్తున్నారు. (కరోనా మృతులు న్యూయార్క్‌లోనే ఎందుకు ఎక్కువ?)

ప్రపంచంలోనే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న స్పెయిన్‌, ఇటలీలతో ఈక్వెడార్‌కు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తగా, ఆర్థిక అసమానతలు కూడా మరోకారణంగా తెలుస్తోంది. పని చేస్తే కానీ ఆహారం దొరకని పేద వారు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఎంత చెప్పినా వారు పనుల్లోకి వెళ్లడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. ఇక 1.7 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్‌లో ఇప్పటికే 7,466 మందికి కరోనా సోకగా 333 మంది మృతిచెందినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ మృతుల సంఖ్య అధికారికంగా చెప్పిన దానికి కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు.

గ్వయాకిల్‌లో ఇళ్ల ఎదుటే కరోనా మృతదేహాలను ఉంచి అంత్యక్రియల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top