లంక అధ్యక్షుడి అడుగులు ఎటువైపు?

Challenges Ahead Sri Lanka President Gotabaya Rajapaksa - Sakshi

కొలంబో: చైనాతో సన్నిహితంగా ఉండే రాజపక్స వంశీయులకు చెందిన గొటబాయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  శ్రీలంకలో ఉన్న మైనార్టీలైన తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో రాజపక్సకు పెద్దగా ఓట్లు రాలేదు. దేశంలోని మెజార్టీగా ఉన్న సింహళ బౌద్ధుల ఓట్లతో గెలవడంతో భారత్‌తో బంధంపై అనుమానాలైతే ఉన్నాయి.

అవినీతి, బంధుప్రీతి 
2005–15 మధ్య గొటబాయ సోదరుడు మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుటుంబ అధిపత్య పాలనలో దేశం విలవిలలాడింది. అన్ని ముఖ్య పదవుల్ని కుటుంబ సభ్యులకే కట్టబెట్టారు. గొటబాయ రక్షణ శాఖ కార్యదర్శిగా ఉంటే,  మరో ఇద్దరు సోదరులు కీలక పదవుల్లో ఉన్నారు. వీరి నలుగురిపై అవినీతి, ప్రజాస్వామ్య విలువల్ని హరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటివి అప్పట్లోనే కలకలం రేపాయి. మహేంద్ర రాజపక్స నలుగురు సోదరుల కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు 2015 ఎన్నికల్లో మహేంద్ర రాజపక్సను గద్దె దింపారు. రాజపక్స హయాంలో శ్రీలంక, భారత్‌ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి. మరోవైపు, గొటబాయతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కొలంబోలో సమావేశమయ్యారు. 29న గొటబాయా భారత్‌కు రానున్నారు.

చైనా రుణాలు భారీగా..
మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు.  మౌలిక సదుపాయాల కల్పన, రేవులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకోవడంతో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రుణాలు ఇచ్చి, వాటిని చెల్లించకపోతే విమానాశ్రయాలు, ఓడరేవుల్ని చైనా లీజుకి తీసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన పుట్టిస్తోంది. యూరప్, ఆసియా మధ్య వాణిజ్య బంధాలకు ప్రతీకగా నిలిచిన  దక్షిణ శ్రీలంకలో హమ్‌బటన్‌టోటా పోర్ట్‌ నిర్మాణానికి రుణాలు చెల్లించలేక 2017లో లంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా శ్రీలంకకి ఉన్న అరుదైన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చైనా చేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top