నిద్ర లేస్తే ఆమె భాషే మారిపోతోంది

American Woman Suffers with Foreign Accent Syndrome - Sakshi

వాషింగ్టన్‌ : నిద్రలో కలలు రావటం.. కలవరపాటుకు గురికావటం సహజం. కానీ, మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి నిద్రలేచాక అకస్మాత్తుగా ‘పొరుగు’భాషలో మాట్లాడితే ఎలా ఉంటుంది.  అరిజోనాకు చెందిన మిచెల్లె మైర్స్‌(45) పరిస్థితి అలాగే ఉంది. ఫారిన్‌ అస్సెంట్‌ సిండ్రోమ్‌ తో ఆమె బాధపడుతోంది. 

ఒక్కోసారి ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అప్పుడు ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఆపై మెలుకువ వచ్చేసరికి అసలు వ్యవహారం మొదలవుతుంది. స్వతహాగా అమెరికన్‌ అయిన ఆమె వేరే వేరే భాషల్లో మాట్లాడుతుంది. అసంకల్పితంగా ఆమె నోటి నుంచి పర భాష పదాలు దొర్లుతుంటాయి. గతంలో ఆస్ట్రేలియన్‌, ఐరిష్‌ భాషలు ఆమె మాట్లాడారు. అయితే అది రెండు వారాలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఓ రోజు నుంచి ఆమె బ్రిటీష్‌ భాష మొదలుపెట్టి రెండేళ్లు మాట్లాడారు. 

దీనికి గల కారణాలను పరిశోధకులు వివరిస్తున్నారు. ‘మనిషి మెదడులో భాషలను గుర్తించే ఓ కేంద్ర విభాగం(బేసల్ గ్యాంగ్లియాన్‌) ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. లేదా షాక్‌ తగిలినప్పుడు పదాల ఉచ్ఛరణ అన్నది వారికి తెలీకుండానే మారిపోతుంది. అలా వారి ప్రమేయం లేకుండానే వేరే భాషలు మాట్లాడుతుంటారు. కానీ, అది తాము సాధారణంగా మాట్లాడే భాషే అని వారనుకుంటారు. ఆ ప్రభావం కొన్ని గంటలు ఉండొచ్చు.. లేదా ఏళ్ల తరబడి ఉండొచ్చు. దీనినే ఫారిన్‌ అస్సెంట్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తుంటార’ని షెలియా బ్లూమ్‌ స్టెయిన్‌ అనే భాషావేత్త వెల్లడించారు. 

గతంలో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. 2010లో వర్జీనియాకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహా సమస్యతో బాధపడినట్లు ది వాషింగ్టన్‌ పోస్టు తన కథనంలో వివరించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇలాంటివి 60 కేసులు నమోదు అయినట్లు నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top