ఆందోళనకు గురిచేస్తోన్న ఐఎల్‌ఓ గణాంకాలు.. | According To ILO Report 152 Million Children Are Forced To Work For Livelihood | Sakshi
Sakshi News home page

ఆందోళనకు గురిచేస్తోన్న ఐఎల్‌ఓ గణాంకాలు..

Jun 12 2018 3:18 PM | Updated on Jun 12 2018 4:32 PM

According To ILO Report 152 Million Children Are Forced To Work For Livelihood - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) విడుదల చేసిన గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చెక్కుపై ఒక్క సంతకంతో లక్షల రూపాయలు సంపాదిస్తున్న నేటి కాలంలో పూట గడవక పిల్లల్ని పనికి పంపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని ఐఎల్‌ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 152 మిలియన్‌ మంది బాల కార్మికులు ఉన్నారని.. వారిలో చాలా మంది ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చేసే కర్మాగారాల్లో పనిచేస్తున్నారని వెల్లడించింది. వీరిలో ఐదు నుంచి పదిహేడేళ్ల వయస్సు లోపు వారే అధికంగా ఉన్నారని పేర్కొంది.

పారిశుద్ధ్యం, భవన నిర్మాణం, వ్యవసాయం, గనులు, ఇళ్లలో పని చేసే బాల కార్మికుల సంఖ్య పెరుగుతోందని ఐఎల్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వారి బాల్యాన్ని హరించడంతో పాటు ఆరోగ్యంపై, ప్రవర్తనపై దుష్ప్రభావాన్ని చూపుతుందని.. విద‍్యకు దూరమవడం వల్ల భవిష్యత్‌ అంధకారంగా మారుతోందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 5 నుంచి 11 సంవత్సరాల వయస్సున్న బాల కార్మికుల సంఖ్య 19 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. అదే విధంగా కర్మాగారాల్లో పని చేసే బాలికల సంఖ్య 28 మిలియన్లు, బాలల సంఖ్య 45 మిలియన్లుగా ఉందని ఐఎల్‌ఓ నివేదికలో పేర్కొంది.

నానాటికీ పెరుగుతున్న బాల కార్మికుల మరణాలు..
భారతదేశంలో అక్రమంగా జరుగుతున్న మైకా గనుల తవ్వకాల కారణంగా కేవలం రెండు నెలల్లో ఏడుగురు బాల కార్మికులు మరణించారని 2016లో రాయిటర్స్‌ పరిశోధనాత్మక నివేదిక వెల్లడించింది. మైకా ఉత్పత్తి చేస్తున్న ప్రధాన రాష్ట్రాలైన బిహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లలో మూడు నెలలపాటు జరిపిన సర్వేలో బాలకార్మికులను ఎక్కువగా నియమించుకున్నట్లు వెల్లడైందని పేర్కొంది. మైకా గనుల్లో పనిచేసే బాల కార్మికులు తీవ్ర అనారోగ్యం పాలవడంతో మరణాలు సంభవిస్తున్నాయని రాయిటర్స్‌ నివేదిక పేర్కొంది.

ఐఎల్‌ఓ ఎజెండా..
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐఎల్‌ఓ-2018 నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా పని ప్రదేశాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించనుంది. సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచదేశాలు 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అంతం చేసేలా కృషి చేయడంతో పాటు కార్మికుల ఆరోగ్యం, భద్రత గురించి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఐఎల్‌ఓ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement