ఇలా చేస్తే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది!

10 Minute Meditation Can Boost Your Brain Function - Sakshi

న్యూయార్క్‌ :  ఒకే పనిని అలా ఎక్కువ సేపు చేయటం వల్ల, ఒక క్లిష్టమైన పనిని చేస్తున్నపుడు.. మెదడు కొంచెం మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. ఆలోచనలు రాక తికమక పడిపోతాం.. ఆ కొద్ది క్షణాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తాయి. అలాంటి సమయంలో కొద్ది సేపు మెడిటేషన్‌ చేయటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. ప్రతి రోజు మెడిటేషన్‌ చేసే వాళ్లు కావచ్చు, కొత్తగా మొదటిసారి చేస్తున్న వారు కావచ్చు సత్వర ఫలితం ఉంటుందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘‘యాలె యూనివర్శిటీ’’, ‘‘స్వర్త్‌ మోర్‌ కాలేజీ’’ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కొంతమంది కాలేజీ విద్యార్థులకు మెడిటేషన్‌కు సంబంధించిన ఆడియోలను ఒక పది నిమిషాల పాటు వినిపించగా.. క్లిష్టమైన పరీక్షల్లో వారు చక్కటి ప్రతిభ కనపరిచారు. క్లాస్‌ రూం సబ్జెక్టులను విన్న వారు అంతగా రాణించలేకపోవటం గమనార్హం. కాలేజీ విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ఒక గ్రూపునకు మెడిటేషన్‌ ఆడియోలను, మరొక బృందానికి టెస్టుకు సంబంధించిన ఆడియోలను వినిపించారు. అయితే మెడిటేషన్‌ ఆడియోలు విన్న వారు ఎక్కువ చురుకుగా ప్రవర్తించారు. ఇప్పటివరకు వారాల, నెలల తరబడి మెడిటేషన్‌ చేసే వారు మాత్రమే చురుగ్గా ఉంటారన్న భావన తప్పని తేలింది. మొదటిసారి మెడిటేషన్‌ చేసిన వారు చురుగ్గా ఉంటారని వెల్లడైంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top