ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య
నగరంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు భార్యతో గొడవ జరగడంతో ప్రాణం తీసుకోగా..
	నగరంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు భార్యతో గొడవ జరగడంతో ప్రాణం తీసుకోగా.. మరొకరు ప్రేమికురాలిని మరిచిపోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు స్థానికుల హృదయాలను కలచివేశాయి.
	 
	పెళ్లైన మూడు నెలలకే..
	 
	జీడిమెట్ల:పెళ్లై మూడు నెలలు కూడా గడవ  లేదు... తరచూ భార్యతో గొడవ జరుగుతోంది... దీంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. ఎస్సై లింగ్యా నాయక్ కథనం ప్రకారం... గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన రమేష్  కుమారుడు మురళీ విహర్(29)కి తూర్పు గోదావరి జిల్లా  అల్లవరం గ్రామానికి చెందిన యువతితో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైంది. అది ప్రేమగా మారింది. విషయాన్ని మురళి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో మురళి పని చేస్తున్నాడు. భార్యతో కలిసి జీడిమెట్ల జనప్రియ అపార్ట్‌మెంట్ లో ఉంటున్నాడు. కాగా, నెల రోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇద్దరి మధ్య  మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మురళి బెడ్ రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా  ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
	 
	ప్రేమికురాలిని మరిచిపోలేక..
	
	భాగ్యనగర్‌కాలనీ: ప్రేమించిన అమ్మాయిని తప్ప మరెవరినీ మనసులో ఊహించుకోలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం... వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్‌కు చెందిన సంగెపు రవీంద్రనాథ్(26) భార్యతో కలిసి మాధవరంనగర్ కాలనీలో ఉంటున్నాడు. భర్త హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా.. భార్య డెంటల్ డాక్టర్. వీరికి ఆగస్టులో పెళ్లైంది. రవీంద్రనాథ్ బుధవారం విధులు ముగించుకొని ఇంట్లోనే ఉన్నాడు.  స్నేహితులు వచ్చి తలుపుకొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో స్థానికుల సహాయంతో ఇంటి యజమాని కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా రవీంద్రనాథ్ అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు.
	
	అదే సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్య విగతజీవిగా  పడి ఉన్న భర్తను చూసి కన్నీరు మున్నీరైంది.  స్థానికులు వెంటనే బంధువులకు, కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రవీంద్రనాథ్ రాసిన సూసైడ్‌నోట్ దొరికింది. అతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ‘ప్రేమించిన అమ్మాయి నాకెంతో సాయం చేసింది. ఆమె లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని, ఆమె నాతో లేకపోవడం ప్రాణం పోయినట్లు ఉంది’.. అని మృతుడు సూసైడ్ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు.  కేసు దర్యాప్తులో ఉంది.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
