దుబాయ్ నుంచి అమ్మ కోసం.. | Sakshi
Sakshi News home page

దుబాయ్ నుంచి అమ్మ కోసం..

Published Mon, Jan 11 2016 12:23 PM

దుబాయ్ నుంచి అమ్మ కోసం.. - Sakshi

మూడు దశాబ్దాల తర్వాత కన్నతల్లిని వెతుక్కుంటూ ఎడారి దేశం దుబాయ్ నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ వచ్చారు. తమ తల్లి జాడ చెప్పండని వారు కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. నగర పోలీసులను ఆశ్రయించి ముప్పై ఏళ్ల క్రితం తమను వదిలి వెళ్లిన తమ తల్లిని వెతకమని అభ్యర్థించారు. తమ వద్ద నున్న తల్లి ఫోటోను, వివరాలను వారికి అందజేశారు.

ఈ సంఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది..1981 డిసెంబర్ 7న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రజియా బేగం అనే అమ్మాయిని దుబాయ్‌కు చెందిన రషీద్ ఈద్ ఒబేద్ రిఫక్ మస్మారీ అనే అరబ్ షేక్ హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. అనంతరం రజియాను తనతో పాటు దుబాయ్ తీసుకెళ్లాడు. వీరు 7 ఏళ్ల కాపురం తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రజియా హైదరాబాద్ వచ్చేసింది.

రజియా, మస్మారీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆ తర్వాత మస్మారీ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు సవతి తల్లి దగ్గరే పెరిగారు. తండ్రి చనిపోతూ అసలు విషయం చెప్పాడు. ఈమె మీకు సవతితల్లే కానీ కన్న తల్లి కాదు అనీ.. మీ కన్న తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఇద్దరు యువతులు కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించారు.

 అయేషా రషీద్ ఈద్ ఒబేద్(29), ఫాతిమా రషీద్ ఈద్ ఒబేద్(25) అనే ఇద్దరు యువతులు మీడియాతో మాట్లాడుతూ..మా తండ్రి, మా అమ్మకు 1988లో విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి మా అమ్మను చూసే అవకాశం రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ కోసం హైదరాబాద్‌కు వచ్చాం. కానీ ఆమె జాడ కనిపెట్టలేకపోయాం. కొంత మంది మిత్రుల సహాయంతో మళ్లీ అమ్మను వెతకటానికి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు.

మా జీవితంలో ఒక్కసారైనా అమ్మను చూడాలనేదే తమ కోరికన్నారు. ఇద్దరు యువతులు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణను కలిసి తమ అమ్మ జాడ కనిపెట్టాల్సిందిగా అభ్యర్థించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement