ఏడాదిలో గజ్వేల్‌కు రైలు!

Train to Gajewal in a year! - Sakshi

సిద్ధమని వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే

మనోహరాబాద్‌–కొత్తపల్లి మార్గం తొలి దశ టార్గెట్‌

32 కిలోమీటర్ల మార్గం ఏడాదిలో పూర్తి..

హైదరాబాద్‌ నుంచి డెమో రైలు నడిపే యోచన

వేగంగా సాగుతున్న వంతెనలు, కల్వర్టుల నిర్మాణం

కుదిరితే జనవరికే సిద్ధం చేయండి: మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు రైలు మొహం చూడని సిద్దిపేట ప్రాంతం కేవలం ఏడాదిలో రైలు కూత వినబోతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి గజ్వేల్‌ వరకు డెమో రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. తెలంగాణలో కీలకమైన కరీంనగర్‌ పట్టణాన్ని సికింద్రాబాద్‌ స్టేషన్‌తో రైల్వే మార్గం ద్వారా అనుసంధానించే ప్రాజెక్టు మనోహరాబాద్‌–కొత్తపల్లి మార్గంలో తొలిదశను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది మార్చిని రైల్వే అధికారులు లక్ష్యంగా నిర్ధారించుకున్నారు.

మేడ్చల్‌ సమీపంలోని మనోహరాబాద్‌ స్టేషన్‌ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్‌ వరకు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న పనులను బేరీజు వేసుకున్న అధికారులు సరిగ్గా ఏడాదిలో రైలు నడిపేందుకు వీలుగా సిద్ధం చేయనున్నట్టు గుర్తించారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. తొలి దశను సకాలంలో పూర్తి చేయనున్నట్టు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం వంతెనలు, కల్వర్టుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పట్టాలు పరిచే పనులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మనోహరాబాద్‌ నుంచి లింక్‌
నిజామాబాద్‌ రైలు మార్గంలో బొల్లారం దాటాక వచ్చే మనోహరాబాద్‌ నుంచి కొత్త లైను మొదలవుతుంది. నేరుగా సికింద్రాబాద్‌ నుంచే మార్గం నిర్మిద్దామనుకున్నప్పటికీ మధ్యలో రక్షణ శాఖకు చెందిన స్థలాలు ఉండటంతో మనోహరాబాద్‌ నుంచి లింక్‌ కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి గజ్వేల్‌ 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పనులు చేపట్టేందుకు అవసరమైన 600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సేకరించారు. మరో 150 ఎకరాలు కావాల్సి ఉంది. దాన్ని కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్షిణ మధ్య రైల్వే కోరింది.  

రెండు నెలల్లో పట్టాల పనులు
గజ్వేల్‌ వరకు 50 కల్వర్టులు అవసరం. ప్రస్తుతం వాటి నిర్మాణం వేగంగా సాగుతోంది. దీంతోపాటు మట్టికట్ట పని దాదాపు పూర్తి కావచ్చింది. దానిపై పట్టాలు పరిచేందుకు అవసరమైన ఏర్పాటు జరుగుతోంది. మరో రెండు నెలల్లో పట్టాలు పరిచే పని మొదలుకానుంది. నాచారం, వీరనగరం, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్‌ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. గజ్వేల్‌ సమీపంలో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో సమావేశమై చర్చించారు. కుదిరితే జనవరి నాటికే పనులు పూర్తి చేసి రైలు నడిపేలా చూడాలని కోరారు. స్టేషన్‌ భవనాలను ఆధునిక పద్ధతిలో నిర్మించాలని సూచించారు.

అర గంటలో గజ్వేల్‌
హైదరాబాద్‌ నగరానికి చేరువగా ఉన్నప్పటికీ గజ్వేల్‌కు ఇప్పటి వరకు రైలుతో అనుసంధానం లేదు. గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూరగాయలు, పళ్లను రైతులు నగరానికి తరలించి విక్రయిస్తారు. ప్రస్తుతం వారికి రోడ్డు మాత్రమే దిక్కు. ప్రజ్ఞాపూర్‌ మీదుగా రావాల్సి ఉంటుంది.

ఇది రామగుండం వరకు విస్తరించిన రాజీవ్‌ రహదారి కావటంతో నిరంతరం వాహన రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. అల్వాల్‌ వరకు వచ్చాక సిటీ ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తుండటంతో రోడ్డు మార్గం గుండా ప్రయాణం తీవ్ర జాప్యానికి కారణమవుతోంది. సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌ వెళ్లేందుకు 2 గంటల సమయం పడుతోంది. అదే రైలు మార్గం ఏర్పాటైతే అర గంటలోనే చేరుకునే వీలు కలగనుండటం రైతులు, ఇతర ప్రయాణికులకు ఎంతో కలిసొచ్చే అంశం.  

ప్రాజెక్టు వివరాలివీ..
ప్రాజెక్టు: మనోహరాబాద్‌–కొత్తపల్లి(కరీంనగర్‌)
నిడివి: 151.36 కి.మీ.
అంచనా వ్యయం: రూ.1,160 కోట్లు
భూ సేకరణ: 2,020 ఎకరాలు
2017 బడ్జెట్‌లో రైల్వే కేటాయింపు: 350 కోట్లు

తాజా బడ్జెట్‌ నిధులు:
రూ.125 కోట్లు
ప్రాజెక్టు తీరు: రాష్ట్ర ప్రభుత్వంతో కలసి రైల్వే చేపడుతున్న భాగస్వామ్య ప్రాజెక్టు
యాన్యుటీ: ఐదేళ్ల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. దాన్ని యాన్యుటీ రూపంలో రైల్వే శాఖకు చెల్లించాలి. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top